Benz Circle flyover: వివిధ కార్యక్రమాల కోసం విజయవాడకు వచ్చే నేతలకు స్వాగత తోరణాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సహజం. ఆ కార్యక్రమం పూర్తయ్యాక నగరపాలక సిబ్బంది వాటిని తొలగిస్తూ ఉంటారు. అయితే విజయవాడ బెంజి సర్కిల్ పైవంతెన స్తంభాలు, గోడలపై రాసిన కొన్ని నినాదాల్ని ఇప్పటికీ తొలగించకపోవడం వివాదానికి కారణమవుతోంది. ఇటీవల మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్‌ను, వైకాపా ప్రభుత్వాన్ని కీర్తిస్తూ... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తూ నినాదాలు రాశారు. బస్సు యాత్ర ముగిసి చాలా రోజులైనా ఇప్పటికీ ఈ నినాదాలను నగరపాలక సంస్థ అధికారులు తొలగించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
బెంజి సర్కిల్ పైవంతెన సుందరీకరణ పనుల్లో భాగంగా దాదాపు 4కోట్లు వెచ్చించి... పార్కులు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. స్తంభాలపై రకరకాల చిత్రాలు వేస్తున్నారు. ఇటీవల పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు బొమ్మలను చిత్రించినప్పటికీ.... ఈ నినాదాలను తొలగించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నినాదాలు రాయించిన వారి నుంచి ప్రకటనల పన్ను కింద జరిమానా వసూలు చేసే అవకాశం ఉన్నా.... అధికారులు ఆ దిశగా దృష్టి పెట్టకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రకటనల విషయాన్ని నగరపాలక సంస్థ అధికారులకు తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుగుదేశం నేతలు అంటున్నారు.