ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అవతార్.. ఇదో కొత్త బెట్టింగ్ దందా..! - Cricket Betting in Vijayawada news

ఐపీఎల్​కి ముందే బెట్టింగ్ దందాను ప్రారంభించి.. లక్షల రూపాయలు దోచేందుకు ప్రణాళిక రచించిన ముఠా గుట్టురట్టయింది. ఎవరికి అనుమానం రాకుండా ఖాళీగా ఉన్న ప్లేస్కూల్​ను అద్దెకు తీసుకున్నారు. అంతర్జాతీయ మ్యాచ్​తో పాటు.. ఐపీఎల్​లో బెట్టింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్​ను వినియోగిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. వారంతా కటకటాలపాలయ్యారు.

Cricket Betting Team Arrest In Vijayawada
బెట్టింగ్ దందా

By

Published : Sep 21, 2020, 5:35 AM IST

Updated : Sep 21, 2020, 7:16 AM IST

బెట్టింగ్ దందా వెల్లడిస్తున్న డీసీపీ

మాచవరం పోలీస్​స్టేషన్ పరిధిలోని మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని శ్రీఆచార్య ప్లేస్కూల్ అండ్ కేర్ పేరుతో ఓ పాఠశాల ఉంది. లాక్​డౌన్ కారణంగా ఈ భవనం ఖాళీగా ఉండగా.. దీన్ని గమనించి నవీన్ అనే వ్యక్తి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు స్కూల్​ను అద్దెకు తీసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహించే పరికరాలన్నీ అందులో సమకూర్చి ముగ్గురు సిబ్బందిని నియమించుకున్నారు. దీనిలో భీమవరానికి చెందిన అట్లూరి శ్రీరంజిత్​కు నెలకు 20 వేల రూపాయలు ఇస్తుండగా.. కాపలా కాసేందుకు విజయవాడ రామలింగేశ్వరనగర్​కు చెందిన శ్రీనాథ్, మొగల్రాజపురానికి చెందిన పెద్దునాగ వెంకట ప్రసాద్​ను నియమించకున్నారు.

దీని గురించి ఈనెల 16వ తేదీ రాత్రి సమయంలో మాచవరం పోలీసులకు సమాచారం అందడంతో.. దాడి చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్​ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అతను దొరికితే ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇంకా ఎవరిపాత్ర ఉందనే విషయం వెలుగులోకి వస్తుందన్నారు. నిందితుల దగ్గర నుంచి 30 ఫోన్ల సామర్థ్యం కలిగిన రిసీవర్ లై బాక్స్, 25 సెల్‌ఫోన్లు, ఓ రికార్డర్, ల్యాప్​టాప్, టీవీలను స్వాధీనం చేసుకున్నారు.

క్రికెట్ బెట్టింగ్​లో బుకీలు, పందెం రాయుళ్లు ఉంటారని.. నగదు లావాదేవీలన్నీ ఆన్​లైన్​లోనే జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. అకౌంట్​లో అయితే అనుమానం వస్తుందనే ఉద్దేశ్యంతో మనీ వ్యాలెట్​లు వినియోగిస్తున్నారని చెబుతున్నారు. వీరిలో ఆర్గనైజర్ ఎక్కడ ఉంటాడో తెలియకుండా.. ఫంటర్స్, బుకీల ద్వారా నిర్వహిస్తుంటారు. విజయవాడలో దొరికిన ఫంటర్ రంజీత్ చదివించి పదో తరగతైనా... వీటి నిర్వహణలో సిద్ధహస్తుడు. అందుకే అతనికి రూ.20 వేలు జీతం ఇచ్చిమరీ పనిలో పెట్టుకున్నాడు. మ్యాచ్ జరిగే సమయంలో జట్లపై పందేలు కాసేందుకు వీలుగా అవతార్ అనే ప్రత్యేక యాప్​ను రూపొందించారు.

దీని ద్వారా బెట్టింగ్​కు పాల్పడే వ్యక్తికి ఓ యునిక్ ఐడీ, పాస్వర్డ్​ను కేటాయిస్తారు. యాప్​లో జట్టు వివరాలు, రేట్లు, ప్లేయింగ్, బాక్స్ తదితర వివరాలు బంతిబంతికీ.. ఓవర్‌టుఓవర్ ధరలు మారుతూ ఉంటాయి. వీటి ప్రకారం జూదగాళ్లు బెట్టింగ్ సాగిస్తున్నారు. లైక్స్​కు ఫోన్లను మార్చి దాని సాయంతో అవతలి వ్యక్తులతో మాట్లాడుతూ.. నగదు లావాదేవీలు సాగిస్తున్నారు. ఇవన్నీ గతంలో బ్యాంకుల ద్వారా జరిగేవి. వీటిపై పోలీసులు నిఘా పెరగడం.. ఆ ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేస్తుండటంతో ప్రస్తుతం ఈ-వ్యాలెట్ల ద్వారా లావాదేవీలు చేస్తున్నారు.

పోలీసులు దాడులు నిర్వహించినప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మూడో వన్డే మ్యాచ్​కి క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో సుమారు 20 మంది ద్వారా రూ.12,51,540 ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ దందా మొత్తం తెలిసిన వారి మధ్యే జరుగుతోందని, తెలియని వారిని ఇందులో చేర్చుకోరని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్​కు బానిసై చాలామంది డబ్బును, జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే.. పోలీస్ వాట్సప్ నెంబర్-7328909090, డయల్ 100కు ఫోన్ చేయాలని కోరారు.

ఇదీ చదవండీ... సీఎంఆర్​ఎఫ్ పేరిట నకిలీ చెక్కులు... కేసు నమోదు చేసిన పోలీసులు

Last Updated : Sep 21, 2020, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details