దేశంలో నిర్మాణ రంగంపై రెండో దశ కరోనా ప్రభావం తీవ్రంగా పడినట్లు కాన్ఫడెరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) సర్వేలో వెల్లడైంది. తాజా పరిస్థితులపై జాతీయ స్థాయిలో క్రెడాయ్ సమగ్ర సర్వే నిర్వహించింది. మొత్తం 11 అంశాలపై నిర్వహించిన సర్వేలో కొవిడ్ కారణంగా డెవలపర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులతోపాటు అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 4,813 మంది డెవలపర్లు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధానంగా నిర్మాణ వ్యయం పెరగడం, కార్మికుల కొరత తీవ్రం కావడం, కొనుగోలుదారులు ముందుకు రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో నిర్మాణరంగం ముందుకు వెళ్లడం లేదని సర్వేలో వెల్లడైంది.
నిర్మాణ రంగం కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నట్లు 92 శాతం మంది, 50 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నట్లు 83 శాతం మంది వెల్లడించారు. కొవిడ్ కారణంగా నిర్మాణాలు ఆలస్యం అవుతున్నట్లు 95 శాతం మంది చెప్పారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల వ్యయం 10 శాతం పెరుగుతుందన్నారు. నిర్మాణ రంగంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు 77 శాతం మంది వెల్లడించారు. ఇళ్ల కోసం విచారణ చేసే వారి సంఖ్య బాగా పడిపోయిందని 98 శాతం మంది డెవలపర్లు తెలిపారు. రెండో దశ కరోనా స్థిరాస్తి వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు 92 శాతం మంది డెవలపర్లు స్పష్టం చేశారు.-రామిరెడ్డి, క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు