తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చేనేత వస్త్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని బాపు మ్యూజియంలో ఈ నెల మెుదటి వారంలో ప్రారంభమైన చేనేత వస్త్రాల మేళా... వచ్చే నెల మెుదటివారం వరకు జరగనుంది.
కొవిడ్ ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో చేనేత మేళాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వటంతో పెద్ద సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన కలంకారి, చేనేత ఉత్పత్తిదారులు పాల్గొంటున్నారు. మంగళగిరి, పోచంపల్లి, వెంకటగిరి, పొందూరు ఖద్దరు, కాశ్మీరీ సిల్క్, కోసా సిల్క్ చీరలు అందుబాటులో ఉంచారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, జూట్ బ్యాగ్‌లు, రకరకాల గాజులు, అలంకరణ వస్తువులు ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రాచీన హస్తకళలపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా దేశంలో ఎక్కడ క్రాప్ట్ మేళాలు నిర్వహించినా అక్కడి వెళ్లి... ఉత్పత్తులను విక్రయించుకుంటారు. స్వయంగా చేత్తో చేయడం ద్వారా ఉత్పత్తుల్లో నాణ్యత ఎక్కువ ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్ ధరలతో పోల్చితే మెరుగైన రాయితీ కూడా అందిస్తున్నట్లు తెలిపారు.