రాజ్యసభలో వైకాపాకు ఉన్న బలంతో ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైతు ప్రయోజనాలు సాధించే అవకాశం వచ్చినా.. భాజపాకు పూర్తిగా మద్దతు పలికి రాష్ట్ర ప్రయోజనాలను ధారాదత్తం చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వంపై పోరాడుతున్నట్లు నటిస్తూ.. కేంద్రంలో భాజపాతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుందని మండిపడ్డారు. వైకాపా అవకాశవాద రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.
లోక్సభలో కేంద్రానికి సంపూర్ణ బలం ఉంది. హోదా సాధ్యం కాదన్న ముఖ్యమంత్రి జగన్... మరి రాజ్యసభలో ఏం చేశారని మధు నిలదీశారు. మూడు రాజధానులపై వైకాపా ఏం చెప్పిందో భాజపా అదే చేస్తుందని పేర్కొన్నారు. భాజపా, వైకాపా మధ్య ఒప్పందం నిన్న రాజ్యసభ సాక్షిగా బయటపడిందని ఆరోపించారు.