భవన నిర్మాణ కార్మికుల ఆందోళనలో పాల్గొనకుండా సీపీఎం నేత బాబురావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక, కరోనాతో పనుల్లేక ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని ఆయన మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి 450 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం తన సొంత అవసరాలకు మళ్లించుకుందని ఆరోపించారు.
వీటన్నింటిపై నేడు రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో విజయవాడ మాచవరం పోలీసులు సీపీఎం నేత బాబురావుకు నోటీసులు జారీచేసి గృహనిర్బంధం చేశారు. పలుచోట్ల సీపీఎం, సీఐటీయూ, ఇతర కార్మిక సంఘాల నాయకులకు నిర్బంధించారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా తక్షణమే రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించాలని.. సంక్షేమ నిధి నుంచి మళ్లించిన డబ్బును మళ్లీ జమ చేయాలని బాబురావు డిమాండ్ చేశారు.