విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. విజయవాడలో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని చెప్పారు. పార్టీలకు అతీతంగా పోరాటాన్ని ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు... పునాదికే సరిపోతాయని, మిగిలినవి ప్రజలు అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయాలనడం దారుణమన్నారు. ఈ నెల 16న పోలవరంలో జరిగే అఖిలపక్ష పర్యటనలో సీపీఐ పాల్గొంటుందని చెప్పారు.