రాష్ట్రంలో రోజుకు పది వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని సీపీఐ రామకృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి కరోనా సోకిందన్నారు. కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేసి.. విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశాయన్నారు. కానీ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ప్రభుత్వం చేసిన ప్రకటన సమంజసం కాదన్నారు. సీబీఎస్సీ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని.. ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసమే ఏపీలో పరీక్షల నిర్వహణ అంటూ సాకు చెప్పడం దుర్మార్గమని విమర్శించారు. విద్యార్థులకు నష్టం కలగకుండా ఉండేందుకు పరీక్షల నిర్వహణ అని విద్యాశాఖ మంత్రి చెబుతున్నారని.. ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యమా? లేక పరీక్షలు ముఖ్యమా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తలెత్తే ఇబ్బందులకు.. ప్రాణాపాయానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని నిలదీశారు. మంత్రుల పిల్లలు పరీక్షలు రాస్తున్నారా? అని రామకృష్ణ నిలదీశారు. తమ పిల్లలకు ఒక న్యాయం.. రాష్ట్రంలోని విద్యార్థులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు.
పరీక్షలు ముఖ్యమా? విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా?: సీపీఐ రామకృష్ణ
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా పరీక్షలను నిర్వహణపై సరైన నిర్ణయం తీసుకోవాలని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయని.. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను తక్షణం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
cpi ramakrishna on tenth exams