జగన్ ముఖ్యమంత్రి అయ్యి 18 నెలలు అవుతున్నా.. ఇప్పటివరకు సక్రమంగా ఇసుక సరఫరా చేయడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తోందని.. నాణ్యమైన ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందని ఆరోపించారు. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని రామకృష్ణ అన్నారు.
ఇసుక విధానంపై ప్రజలను సలహాలు... సూచనలు అడుగుతున్న ప్రభుత్వం.. తాము సలహాలు ఇస్తుంటే ఆరోపణలు చేస్తోందని రామకృష్ణ అన్నారు. వైకాపా ప్రజా ప్రతినిధులే ఇసుక మాఫియా చేస్తూ కోట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో ఇసుక కోసం వైకాపా నాయకుడు సెల్ టవర్ ఎక్కాడంటే.. ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. అధికార పార్టీకి చెందిన వారే ఇసుక కోసం ఆందోళన చేస్తున్నారని.. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి సక్రమంగా ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.