ఎంపీ రఘురామ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని చూసి జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన "ప్రజాస్వామ్యం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ" అనే అంశంపై నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం న్యాయ స్థానం ఆదేశాలను కూడా అమలు చేయకపోవటం సరైన విధానం కాదని రామకృష్ణ మండిపడ్డారు. రఘురామకృష్ణరాజుకు రాష్ట్రంలో సరైన వైద్యం దొరకదనే పక్క రాష్ట్రంలో ఆర్మీ ఆసుపత్రిని ఎంచుకున్నారన్నారు. కరోనా నియంత్రణ సింగిల్ అజెండాగా పెట్టుకుని పనిచేయాల్సిన సమయంలో సీఎం జగన్ కక్షసాధింపు అనే సొంత అజెండాతో ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంపై నమ్మకంలేని పాలకుల రాజ్యంలో రాష్ట్రం ఉందని పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ధ్వజమెత్తారు. ప్రజల హక్కుల కాపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుండాలని..,ప్రజాసంఘాలు చొరవ చూపాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.