భవిష్యత్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎవ్వరికీ ఉత్తరాలు రాయకుండా చేయాలనుకుంటున్నారని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఉత్తరాలు రాస్తే విచారణకు పిలుస్తాం అనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుపుతుందా? జగన్ ఏకపక్ష రాజ్యం నడుస్తుందో.. అర్థం కావడం లేదన్నారు.
ఉత్తరం రాస్తే.. విచారణకు పిలుస్తారా?: రామకృష్ణ - జగన్పై సీపీఐ రామకృష్ణ కామెంట్స్
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మదనపల్లి డీఎస్పీ నోటీసులు పంపడం చాలా ఆశ్యర్యంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎస్సీ యువకుడు శ్రీకాంత్ మరణంపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాస్తే ఆయనపై పోలీసులు ఈ విధంగా స్పందించడమేంటన్నారు.
మాస్క్లు, పీపీఈ కిట్లు లేవని డాక్టర్ సుధాకర్ చెబితే ఆయనపై పోలీసులతో దాడి చేయించడమే కాకుండా.. పిచ్చివాడిగా ముద్ర వేశారన్నారు. ఇసుక మాఫీయాకు వ్యతిరేకంగా ఒక ఎస్సీ యువకుడు గొంతు ఎత్తితే ఆతనికి పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేయించారన్నారు. ముఖ్యమంత్రి జగన్.. పోలీస్ డ్రెస్ వేసుకుని పాలన చేస్తే సరిపోతుందని రామకృష్ణ విమర్శించారు. లేకపోతే జగన్ ఇడుపులపాయలో కుర్చొని రాష్ట్రాన్ని డీజీపీకి అప్పగిస్తే ఆయనే పరిపాలన చేస్తారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ