కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై డ్రామాలాడుతూ ప్రజల చెవిలో పూలు పెడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గతంలో ప్రతిపక్ష నేతగా పెట్రోల్, డీజిల్ ధరలపై స్పందించిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు ధరల పెంపుపై స్పందించటంలేదని ప్రశ్నించారు. తక్షణమే చమురు ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రంలో అమిత్ షా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రభుత్వ ఆస్తులను అదానీకి కట్టబెడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా మార్చేశారని ఆయన దుయ్యబట్టారు. పోర్టులు, విద్యుత్, బొగ్గు కొనుగోలు వంటి వాటిని మొత్తం అదానీకి కట్టబెట్టడంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈనెల 14న తిరుపతిలో అమిత్ షా పర్యటన సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసనలు తెలుపుతామన్నారు. మహా పాదయాత్రలో అమరావతి రైతులపై దాడి జరగే అవకాశం ఉందన్న సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆయన మండిపడ్డారు. ఎవరు దాడి చేస్తారో సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు. 90 శాతం ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని..రాజధాని మార్పుపై రెఫరెండం పెట్టాలని రాకమృష్ణ సవాల్ విసిరారు.