వేల కోట్ల రూపాయల విలువ చేసే రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి గంగవరం పోర్టు(gangavaram port)ను.. కమిషన్ల కోసం తక్కువ ధరకు ప్రైవేట్ సంస్థకు అప్పగించడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI RAMAKRISHNA) మండిపడ్డారు. 16ఏళ్ల తర్వాత పోర్టు పూర్తిస్థాయిలో ప్రభుత్వానికే సొంతమవుతుందన్న విషయం కూడా మంత్రి బొత్సకు తెలియదా అని ప్రశ్నించారు. పోర్టును ప్రైవేటు సంస్థకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
రైతులను అవమానించేలా మంత్రి బొత్స మాట్లాడుతున్నారని.. చట్టబద్ధమైన ఒప్పందాలను ఈ ప్రభుత్వం గౌరవించదా అని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందన్నారు. ప్రధాని మోదీ ఆమోదం తీసుకున్నాకే.. సీఎం జగన్(JAGAN) మూడు రాజధానులు ప్రకటించారని ఆరోపించారు. అమరావతి ఏకైక రాజధానిగా కేంద్రం ప్రకటించాలి. రాష్ట్ర భాజపా నేతలు నాటకాలు మాని.. ఆ దిశగా అధిష్టానాన్ని ఒప్పించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం.. కమిషన్ల కోసమే గంగవరం పోర్టును అదానీ సంస్థకు అప్పగించింది. 16ఏళ్ల తరువాత పోర్టు మొత్తం రాష్ట్రప్రభుత్వానికే దక్కుతుంది కదా.. ఈ విషయం కూడా తెలియదా..? గంగవరం పోర్టు ప్రైవేట్ నుంచి ప్రైవేటుకు వెళ్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి బొత్స అంటున్నారు. అసలు మాకేం తేలియదు.. అంతా ఆయనకే తెలుసని అనుకుంటున్నారా..? పోర్టును ప్రైవేటు పరం చేసే అంశాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జరగాలి. విశాఖ రాజధాని అని కేంద్రం స్టేట్మెంట్లు ఇస్తోంది. దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమం చేపట్టగానే మళ్లీ మాట మారుస్తుంది. ప్రభుత్వం, మంత్రులు.. అమరావతి రైతులతో ఎందుకు మాట్లాడరు. అమరావతే రాష్ట్ర రాజధాని అని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. అప్పటి వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. -రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి