CPI leader Narayana comments: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని, రైతుల ఉద్యమానికి అండగా నిలబడాలని.. విజయవాడలో జరిగిన 24వ సీపీఐ జాతీయ మహాసభల్లో ఏకగ్రీవంగా తీర్మానించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు తీర్మానం ప్రవేశపెట్టారు. మహాసభల్లో పాల్గొన్న 29 రాష్ట్రాల ప్రతినిధులు ఈ తీర్మానాన్ని ఆమోదించారు. రాజధాని కోసం రైతులు భూములిస్తే.. మూడు రాజధానుల పేరిట వైకాపా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం దారుణమని సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని.. జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. మూడు రాజధానుల పేరిట ప్రభుత్వం కృత్రిమ ఉద్యమం చేస్తోందని విమర్శించారు. విశాఖ భూకుంభకోణంపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
రాజధాని రైతుల పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని.. జాతీయ కార్యవర్గ సభ్యుడు అతుల్‌కమార్ అంజద్ తెలిపారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో ప్రభుత్వం అలజడులు సృష్టిస్తోందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ఐకాసలో మంత్రులు, వైకాపా నాయకులు తప్ప.. రాష్ట్రంలో ఇతర పార్టీలేవైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.