పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఎద్దేవా చేశారు. పరిషత్ ఎన్నికలు ఇప్పుడు నిర్వహిచటం కుదరదని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పేర్కొన్న విషయాన్ని అధికార పక్షం సానుకూలంగా స్వీకరించలేకపోయిందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు, సూచనలతో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు హడావుడిగా నిర్వహించడం సాధ్యం కాదని నిమ్మగడ్డ చెప్పిన విషయాన్ని నారాయణ గుర్తు చేశారు.
కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని... ముఖ్యమంత్రి మెప్పు కోసమే హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు అభాసుపాలు కావాల్సి వచ్చిందన్నారు. ఎస్ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనే తాజాగా.. రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. ఎన్నికలు వాయిదా పడినందున పరిషత్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ పునరాలోచన చేయాలన్నారు.