CPI Ramakrishna: పెళ్లి తర్వాత ఆరు నెలల తర్వాత శుభలేఖ ప్రచురించినట్లుగా.. అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయటపెట్టారని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. పీఆర్సీ ఒప్పందంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆక్షేపించారు. ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులతో మరో దఫా చర్చలు జరపాలని కోరారు. అశుతోష్ మిశ్రా నివేదిక ప్రకారం.. 27 శాతం ఫిట్మెంట్ ఇచ్చి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
అశుతోష్ మిశ్ర నివేదికలో ఏముంది..
Ashutosh Mixed Committee Report: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా పని చేయాలంటే ఖాళీ అవుతున్న పోస్టులను గుర్తించి, ప్రతి ఏటా భర్తీ చేయాల్సిందేనని అశుతోష్ మిశ్ర కమిటీ నివేదిక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కార్యాలయాలు ఒక పద్ధతి ప్రకారం, సమర్థంగా పని చేయాలంటే ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడం ముఖ్యమని పేర్కొంది. ఏళ్ల తరబడి ఖాళీలను నింపకుండా.. ఒకేసారి వాటిని భర్తీ చేస్తే రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. దీనివల్ల ఒకేసారి ఉద్యోగాల భర్తీ, ఒకేసారి పదవీ విరమణ వంటి పరిస్థితులు ఏర్పడతాయని వివరించింది. ‘ప్రతి ప్రభుత్వశాఖా ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏటా దీన్ని నవీకరించి, ఎప్పుడు ఎన్ని ఖాళీలు వస్తున్నాయన్న సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలి. పదవీ విరమణ, పదోన్నతుల వల్ల ఏర్పడే ఖాళీలపై కూడా స్పష్టత ఉండాలి. ఏపీపీఎస్సీ ద్వారా లేదా జిల్లా ఎంపిక కమిటీల సాయంతో లేదా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని అశుతోష్ కమిటీ కుండ బద్దలు కొట్టింది.