CPI 24th party Congress: నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు.. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు విజయవాడకు భారీగా చేరుకున్నారు. మహాసభల ప్రారంభ సూచికంగా నగరంలోని బీఆర్‌టీసీ రోడ్డు, మీసాల రాజేశ్వరరావు వంతెన కూడలి నుంచి అజిత్‌సింగ్ నగర్‌లోని ఎంబీ స్టేడియం వరకు ఐదు కిలోమీటర్ల పొడవునా ప్రజా ప్రదర్శన పేరిట కవాతు నిర్వహించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటు జాతీయ, అంతర్జాతీయ, విదేశీ ప్రతినిధులు ప్రదర్శనలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు వాయిద్యాల నడుమ ప్రదర్శన సాగింది.
సీపీఐ 23వ జాతీయ మహాసభలు జరిగిన కేరళలోని కొల్లా నుంచి ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి రామన్ నేతృత్వంలో ఫ్లాగ్‌మార్చ్‌గా విజయవాడ వచ్చి పార్టీ పతాకాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాకు అందజేశారు. 1975 తర్వాత మళ్లీ జాతీయ మహాసభలు ఇన్నేళ్లకు విజయవాడలో జరగడంతో భారీగానే ప్రతినిధులు పాల్గొన్నారు. 12 దేశాల నుంచి 30 మందికిపైగా విదేశీ ప్రతిధులు మహాసభల్లో పాల్గొన్నారు. వీరంతా సౌహాద్ర ప్రతినిధులుగా తరలివచ్చారు. ఇందులో రష్యా, చైనా, క్యూబా, ఫ్రాన్స్, అమరికా, పాలస్తీనా, గ్రీస్, వియత్నాం, లావోస్, దక్షిణాఫ్రికా, నేపాల్, కొరియా, పోర్చుగల్, శ్రీలంక, బంగ్లాదేశ్, టర్కీ దేశాల నుంచి ఆయా కమ్యూనిస్టులు, పార్టీలు ప్రజాసంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.