రాష్ట్రంలో ఉద్ధృతంగా వ్యాపిస్తున్న కరోనా సెకండ్‌వేవ్ బాధితుల్లో చిన్నారులూ ఎక్కువే! రాష్ట్రంలోని చిన్నపిల్లల వైద్యుల దగ్గరకు వస్తున్న కేసుల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారిలో నెలల వయసున్న పసివాళ్లూ ఉంటున్నారు. మూడు రోజుల్లోనే 30 మంది కరోనా బాధిత బాలలకు చికిత్స చేసినట్లు విశాఖకు చెందిన చిన్న పిల్లల వైద్యుడు సతీష్‌కుమార్ వెల్లడించారు. గడచిన వారంలో రోజుకు 8-10 కేసులు చొప్పున చూస్తున్నాని తిరుపతికి చెందిన వైద్య నిపుణుడు మునిశేఖర్ తెలిపారు.ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కరోనా సోకిన చాలామంది పిల్లల్లో స్వల్ప లక్షణాలే ఉంటుండటం, చికిత్స ప్రారంభించిన నాలుగైదు రోజుల్లోనే కోలుకోవడం సానుకూలాంశాలని వారు చెబుతున్నారు. మన దగ్గర ఇంత వరకు పిల్లల్లో సీరియస్ కేసులు పెద్దగా నమోదవకపోయినా, ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కరోనా సోకిన పిల్లల్లో వ్యాధి తీవ్రమైన దాఖలాలు ఉన్నాయని వారు విశ్లేషించారు.
పెద్దల నిర్లక్ష్యంతో..
గత ఏడాది కరోనా ఉద్ధృతంగా ఉన్నప్పుడు పెద్దలే ఎక్కువగా దాని బారినపడ్డారు. బాధితుల్లో 10-15 శాతమే పిల్లలున్నారు. అప్పట్లో ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం, విద్యాసంస్థలు మూసివేయడం, లాక్‌డౌన్‌తో పెద్దవాళ్లూ చాన్నాళ్లు ఇళ్లకే పరిమితమవడం వల్ల శిశువుల నుంచి పిల్లల దాకా కరోనా సోకిన వారి సంఖ్య తక్కువ. అప్పట్లో కొందరు పిల్లల్లో లక్షణాలు కనిపించకపోవడంతో, వారికి కరోనా సోకిన విషయం తెలియకుండానే తగ్గిపోయింది. అందుకు భిన్నంగా సెకండ్‌వేవ్‌లో పిల్లలకు వైరస్ ఎక్కువగా సోకుతోంది. జనం కదలికలపై ఆంక్షలు లేకపోవడం, షాపింగ్‌లు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెద్దవారు తమతోపాటు పిల్లల్నీ తీసుకెళుతున్నారు. నిన్నమొన్నటి దాకా విద్యాసంస్థలూ పనిచేశాయి. ఇవన్నీ చిన్నారుల్లో కరోనా వ్యాప్తికి ప్రధాన కారణాలయ్యాయి. ప్రస్తుతం ఐదేళ్లకంటే తక్కువ వయసు వారికి ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి వైరస్ వ్యాపిస్తోందని, ఐదేళ్లు దాటిన పిల్లలకు బడుల్లో కొవిడ్ సోకిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో చిన్నారుల్లో కరోనా కేసులు బయటపడుతున్నా తీవ్ర అనారోగ్య సమస్యలు కనిపించడం లేదని, ఇతర రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని వెల్లడించారు.
చికిత్స ఎలా?
పిల్లలకు కరోనా వస్తే ఎలాంటి చికిత్స చేయాలన్న విషయంలో ఐసీఎంఆర్ వంటి సంస్థలు నిర్ధిష్ట ప్రొటోకాల్స్ రూపొందించాయి. కరోనా సోకిన పిల్లల్ని లక్షణాల్ని బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ అని మూడు కేటగిరీలుగా విభజిస్తారు.
- జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలే ఉండి, ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఇంట్లోనే ఉంచి (హోం ఐసోలేషన్) చికిత్స అందించాలి.
- ఆయాసం, వేగంగా శ్వాస తీసుకోవాల్సి రావడం, ఆహారం సరిగ్గా తీసుకోలేక పోవడం వంటి లక్షణాలుంటే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలి. వారిలో కొంతమందికి ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది.
- తీవ్ర అస్వస్థతకు గురైన పిల్లలకు కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (సీపాప్) విధానంలో, వెంటలేటర్‌పైనా చికిత్స చేస్తారు.
- మన రాష్ట్రంలో తొలిదశ కరోనా ఉద్ధృతిలోను, ఇప్పుడూ... కరోనా సోకిన పిల్లల్లో చాలావరకు స్పల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి.
వైరస్ తగ్గాకా ప్రమాదం
కరోనా సోకడం వల్ల పిల్లల్లో యాంటీబాడీలు అవసరానికి మించి ఉత్పత్తయి, కొన్ని సందర్భాల్లో అవి శరీరంలోని ఇతర అవయవాలకు హాని చేస్తాయని, దీన్నే ఎంఐఎస్ డిసీజ్‌గా పిలుస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్వరం, విరేచనాలు, కడుపునొప్పి, గుండెకొట్టుకునే వేగం పెరగడం, ఒంటిపై దద్దుర్లు రావడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. దీన్ని వెంటనే గుర్తించి చికిత్స చేస్తే త్వరగానే నయమైపోతుంది. నిర్లక్ష్యం చేస్తే... గుండెలో రక్తనాళాలు ఉబ్బడం వంటి సమస్యలు ఏర్పడవచ్చని ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ లక్షణాలు ఉంటే..
- ఇది వరకు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటేనే కొవిడ్‌గా అనుమానించేవారు. ప్రస్తుతం ఎక్కువమంది పిల్లలు ఒళ్లు నొప్పులు, తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలతో వస్తున్నారని, వారికి పరీక్షలు చేస్తే కరోనా సోకినట్టు తేలుతోందని వైద్యులు చెబుతున్నారు.
- పిల్లల్లో జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే... కొందరు తల్లిదండ్రులు కరోనా పరీక్ష చేయించకుండా స్థానిక వైద్యుల దగ్గర చికిత్స తీసుకుంటున్నారు. మూడు నాలుగు రోజుల్లో వారికి ఆ లక్షణాలు తగ్గిపోయే సరికి వారిని స్కూళ్లకూ పంపించరు. వారిలో ఇంకా వైరస్ ఉండటంతో తోటి పిల్లలకు వ్యాపించింది.
- ఐదేళ్లలోపు పిల్లల వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వాళ్లు మాస్క్‌లు పెట్టుకోవడం లేదు. తరచూ ఏడుస్తుండటం వల్ల వారి నుంచి స్రావాలు విడుదలవడం వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది. అలాంటి పిల్లల నుంచి ఇంట్లోని పెద్దలకు కరోనా సోకుతోంది.