ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మహిళ మృతి వాస్తవమే... ఆలస్యం అయిందనడమే అవాస్తవం' - corona effect on vijayawada

విజయవాడలోని రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి వివాదాస్పదంగా మారింది. మహిళ మంచం మీద నుంచి పడిపోయి చనిపోయినా ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించలేదంటూ... అదే వార్డులో ఉన్న మరో మహిళ తీసిన వీడియో కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఆసుపత్రి వర్గాలను వివరణ కోరగా మహిళ మృతి వాస్తవమే గానీ ఆలస్యం అయిందనడం అవాస్తవమని తెలిపారు.

Covid patient dead in Vijayawada Hospital
రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రి

By

Published : Jul 23, 2020, 3:39 AM IST

ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బెడ్ పైనుంచి కింద పడిపోయి చనిపోయిన ఘటన విజయవాడ కోవిడ్‌ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆమె చనిపోయి మూడు గంటలు గడిచిన తరువాత కూడా ఆసుపత్రి సిబ్బంది స్పందించలేదంటూ అదే వార్డులో చికిత్స పొందుతున్న మరో మహిళ తీసిన వీడియో కలకలం రేపుతోంది. కరోనా బారినపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 8 గంటల సమయంలో మృతి చెందిందని, చనిపోయే ముందు వాంతులు చేసుకుంటూ మంచం పైనుంచి నేలపై పడిపోయిందని తెలిపారు.

విజయవాడ రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రికి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను తీసుకొస్తున్నట్లు... ఆసుపత్రి అధికారులు తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వాళ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ సహాయం అవసరమైన వారిని ఇక్కడికే తీసుకొస్తున్నారు. ఆసుపత్రిలో 500కు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ... ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో ఆసుపత్రిలోని మంచాలు చాలావరకూ నిండిపోయాయని అధికారులు పేర్కొన్నారు. వీరిని ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ బ్లాక్​లో ఉంచి వైద్యం అందిస్తున్నామన్నారు.

ఇప్పటికే ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే వారిలో 25 మంది వరకూ కరోనా బారినపడ్డారని... వైద్యులు సైతం వార్డుల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారన్నారు. రోగులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు మార్చాలన్నా... అన్నింటికీ కిందిస్థాయి సిబ్బందినే వినియోగిస్తున్నట్టు తెలిపారు. దీంతో సరైన వైద్య సేవలు అందడం లేదంటూ కొద్దికాలంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు సరైన సేవలు అందించడం లేదని, కనీసం వారు లోపల ఎలా ఉన్నారనే సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ బంధువులు వాపోతున్నారు. ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి బాత్రూంకు వెళ్లి లోపల నుంచి గడియ పెట్టుకుని కూలబడిపోయి చనిపోయిన విషయాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచారని సమాచారం.

కరోనా వైరస్ బారినపడిన వాళ్లలో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్న వారినే ఎక్కువగా ఇక్కడికి తీసుకొస్తుండడంతో మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా ఇక్కడే అధికంగా ఉంటోంది. ఆసుపత్రిలో చేరే రోగులకు ఇచ్చే ఆహారం కూడా సమయానికి రావడం లేదంటూ వాపోతున్నారు. ఇటీవల ముగ్గురు మహిళలు ఆసుపత్రిలో తమ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ సెల్ఫీ వీడియోలను తీసి తమ ఆవేదనను వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెరిగిన రోగులకు తగ్గట్టుగా సిబ్బందిని అధికారులు పెంచడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రోగులను సరిగా పర్యవేక్షించే పరిస్థితి లేదంటూ సిబ్బంది వాపోతున్నారు.

ఆరోగ్యం విషమించి మహిళ చనిపోయిన విషయం వాస్తవమేనని విజయవాడ కోవిడ్‌ ఆసుపత్రి ఆర్ఎంవో శోభ వివరణ ఇచ్చారు. మూడు గంటల వరకూ సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదనడం అవాస్తవమని తెలిపారు. వార్డులో ఎప్పుడూ సిబ్బంది ఉంటారని... ఆమె పడిపోయిన తర్వాత సిబ్బంది వెళ్లేలోపే వీడియో తీసి పెట్టారని శోభ వెల్లడించారు.

ఇదీ చదవండీ... 'భూములెందుకు అమ్ముతున్నారు.. ఆ హక్కు మీకెక్కడిది..?'

ABOUT THE AUTHOR

...view details