రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజువారీ పరీక్షల్లో.. 20 శాతం మందికిపైగా వైరస్ బారినపడుతున్నారు. మరణాలూ రోజూ 90కి తగ్గడం లేదు. పల్లెల నుంచి పట్టణాల దాకా వైరస్ కమ్మేసింది. రోగులకు ఆసుపత్రుల వద్ద పడిగాపులు తప్పడం లేదు. రోగి ఆక్సిజన్ స్థాయి తగ్గితే లక్షలు ఇస్తామంటున్నా.. ప్రైవేటు ఆసుపత్రులు బాధితుల్ని.. చేర్చుకోవడం లేదు. సొంతంగా ఆక్సిజన్ సమకూర్చుకుంటే పడకలు సర్దుబాటు చేస్తామంటున్నాయి.. ప్రైవేటు ఆసుపత్రులు.
వాహనాల్లోనే ఆక్సిజన్ సిలిండర్లు
రాష్ట్రంలో కరోనా హైరానా పెరిగిపోతోంది. గతేడాది కరోనా వచ్చినప్పుడు.. ఇంట్లో ఉంటూనే అనేక మంది వైరస్‌ను... జయించారు. ఇప్పుడు రోజులు బాగోలేవు. హోం ఐసొలేషన్ అవుతున్న చాలామంది బాధితుల్లో ఒక్కసారిగా శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అప్పటికప్పుడు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకలు దొరికితే అదృష్టం.. లేదంటే.. దేవుడిపై భారం వేయడమే అన్నట్లుంది. బెడ్ ఖాళీ అయ్యే దాకా.. వాహనాల్లోనే ఆక్సిజన్ సిలిండర్లు అమర్చుకుని నిరీక్షిస్తున్నవారు కోకొల్లలు. అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు పూర్తిగా నిండిపోయాయి. కొందరికి ఆరుబయటే చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జిల్లాలోనైతే ఎక్స్‌రే యంత్రం కూడా బయటికి తెచ్చి పరీక్షలు చేస్తున్నారు.
పడకల కోసం ఆరుబయటే..
కొవిడ్ రోగి 108 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన మూడు గంటల్లోగా పడకలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రతి సమీక్షలోనూ చెప్తున్నారు. ఆచరణలో అదేమీ కనిపించడం లేదు. ఫోన్ చేస్తే బెడ్ కాదుకదా.. కనీసం ఆస్పత్రి ఆవరణలో ఇంత ఖాళీ జాగా దొరికినా గొప్పే అన్నట్లుంది. 30 గంటలకుపైగా వాహనాల్లోనే వేచిచూసి.. ఆస్పత్రి ఆవరణలోనే విగతజీవులవుతున్న విషాద ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులైతే.. కేసు తీవ్రత ఎక్కువ ఉంటే మొహం మీదే గేట్లు మూసేస్తున్నాయి. ఖర్చు ఎంతైనా భరిస్తామంటున్నా అంబులెన్సులను ఆస్పత్రి ఆవరణలోకి కూడా అడుగుపెట్టనివ్వడంలేదు. దీనికి ఆక్సిజన్ కొరతను కారణంగా ఆయా ఆస్పత్రులు చెప్పుకొస్తున్నాయి. రోజూ వందల మంది ఆసుపత్రుల్లో చేరుతుంటే పది నుంచి 20 మంది కూడా డిశ్చార్జి కావడం లేదు. కొవిడ్ వైద్యం అందించే ఏ ఆస్పత్రికి వెళ్లినా పడకల కోసం ఆరుబయట నిరీక్షిస్తూనే ఉంటున్నారు.
వాట్సాప్ ద్వారా మందులు
కొవిడ్ తొలి విడత కంటే రెండో విడతలో పరిస్థితులు దయనీయంగా ఉంటున్నాయి. కరోనా పరీక్షా ఫలితాల్లో జాప్యం.. మరో సమస్యకు దారితీస్తోంది. పాజిటివ్ వస్తే హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగని 104 కాల్ సెంటర్‌కుగానీ, ఏఎన్‌ఎంకు గానీ ఫోన్ చేస్తే హోం ఐసొలేషన్ కిట్లు ఇవ్వడం లేదు. కొవిడ్ కేర్ సెంటర్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. చాలామంది ప్రైవేటు వైద్యులను సంప్రదించి వాట్సాప్ ద్వారా మందులు తెప్పించుకుని వాడుతున్నారు. అలా హోం ఐసొలేషన్‌లో చివరి క్షణం వరకూ ప్రమాదాన్ని అంచనా వేయలేకపోతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తగానే ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి కేసులు పెరగడం ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల కొరతకు కారణమవుతోంది.
మందుల ధరలు పెరిగాయి
ఆరోగ్య పరిస్థితి విషమించిన కరోనా బాధితులకు అందజేసే.. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఈ నెల మొదటి వారం వరకూ ఎక్కువే ఉంది. నకిలీ ఇంజక్షన్ల దందా కూడా నడిచింది. కరోనా బాధితులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను.. ఆస్పత్రి సిబ్బందే బయటికి తెచ్చి 50 వేల నుంచి 80 వేల రూపాయలకు విక్రయించిన ఉదంతాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు అవసరమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను డ్రగ్ కంట్రోల్ అథారిటీ ద్వారానే సరఫరా చేస్తుండడంతో సమస్య తీవ్రత కొంత తగ్గింది. కరోనా కేసులకు తోడు మే మొదటి వారంలో.. సాధారణ మందుల ధరలూ పెరిగాయి. ఆక్సిజన్ స్థాయిలు గుర్తించే పల్స్ ఆక్సీమీటర్లు, జ్వరం తీవ్రత గుర్తించే థర్మామీటరు తగినంత స్టాక్ లేక ధరలు పెంచేశారు.