'కనపడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం అంతా'.. ఈ పాట రంగస్థల కళాకారుల ప్రస్తుత దయనీయ స్థితికి అద్దం పడుతుంది. ఆ కనపడని చేయి పేరే కరోనా వైరస్. దాని కబంధ హస్తాల్లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. ఎలాంటి విషయమైనా ప్రజలకు సులభంగా చేరవేసే స్థాయి నుంచి ఈ తరం వారికి పెద్దగా తెలియని స్థాయికి నాటకరంగం పడిపోయింది. కళపై మక్కువతో కొందరు ఇప్పటికీ అరకొర నాటకాలు వేస్తూ నాటక రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
ఒక్క విజయవాడలోనే వందలాది కళాకారులు ఇప్పటికీ రోజూ పద్యాలు సాధన చేస్తుంటారు. నాటకాలు ఉన్నా లేకున్నా కళను బతికించుకునేందుకు సాధన ఆగదని కరోనా దెబ్బకు మొత్తం అతలాకుతలమైందని విలపిస్తున్నారు. చిన్నతనం నుంచే రంగస్థలాన్ని నమ్ముకున్నామని మొదటి దశ ముగిసిందనుకునే సరికే రెండో దశ ముంచుకొచ్చిందని కళాకారులు వాపోతున్నారు.