ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ కమిషనర్ బంగ్లాను అటాచ్​ చేస్తూ కోర్టు ఆదేశాలు - VMC Latest News

కార్పొరేషన్ నుంచి బిల్లులు చెల్లించని కారణంగా.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లాను అటాచ్​ చేస్తూ... కృష్ణా జిల్లా వాణిజ్య వివాదాల పరిష్కార న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. బందరు రోడ్డులోని 2592 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని 29.25 కోట్ల రూపాయల విలువైన కమిషనర్ బంగ్లా అటాచ్​మెంట్​కు గుత్తేదారుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది.

విజయవాడ కమిషనర్ బంగ్లా
విజయవాడ కమిషనర్ బంగ్లా

By

Published : Apr 1, 2021, 5:21 PM IST

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లాను అటాచ్​మెంట్ చేస్తూ... కృష్ణా జిల్లా వాణిజ్య వివాదాల పరిష్కార న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. గుత్తేదారు సంస్థకు కార్పొరేషన్ నుంచి బిల్లులు చెల్లించని కారణంగా వారు కోర్టును ఆశ్రయించారు. జేఎన్ఎన్​యూఆర్ఎం పథకం కింద 2012లో బీఆర్టీఎస్ రహదారి వెంట మూడు ప్రాంతాల్లో అక్కడి కాలువపై హైదరాబాద్​కు చెందిన కాంటెక్ సిండికేట్ సంస్థ బ్రిడ్జిల నిర్మాణం చేసింది. ఆ సంస్థకు బిల్లుల బకాయిలు చెల్లించడంలో నగరపాలక సంస్థ అధికారులు జాప్యం చేశారు. గుత్తేదారు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... ఆర్బిట్రేటర్‌ను నియమించింది. సమస్యను తాము న్యాయస్థానం వెలుపల పరిష్కరించుకుంటామంటూ నగరపాలక సంస్థ అధికారులు అనుమతి పొందారు. తర్వాత ఓ న్యాయవాది సమక్షంలో చర్చలు సాగాయి.

తనకు 18 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాలంటూ గుత్తేదారు కోరగా... 9 కోట్లు చెల్లించేందుకు ఇరువర్గాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆపై సొమ్ము చెల్లించేందుకు అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్కడి నుంచి సకాలంలో అనుమతి పొందే విషయంలో అధికారులు విఫలమయ్యారు. ఈ విషయంపై.. గుత్తేదారు తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అధికారులు స్పందించని కారణంగా తన అవార్డును అమలు చేయాలంటూ ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈసీ) వేసి కమిషనర్ బంగ్లా అటాచ్​మెంట్ కోసం అనుమతి కోరారు. అందుకు న్యాయస్థానం అంగీకరించి బందరు రోడ్డులోని 2592 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని 29.25 కోట్ల రూపాయల విలువైన కమిషనర్ బంగ్లా అటాచ్​మెంట్​కు గుత్తేదారుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది.

ABOUT THE AUTHOR

...view details