విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు దిశ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రస్తుతం నాగేంద్రబాబు అరెస్టై పోలీసుల రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. అతనికి విధించిన 14 రోజుల రిమాండ్ ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. విచారణ ఆ రోజు నాటికి పూర్తి చేసి సాయంత్రం 5 గంటలలోపు కోర్టులో తిరిగి హాజరుపరచనున్నట్లు సమాచారం. అలాగే విచారణలో సేకరించిన సమాచారాన్ని కూడా కోర్టుకి సమర్పించే అవకాశం ఉంది.
గత నెల 15వ తేదీ విజయవాడలోని మాచవరంలో జరిగిన ఈ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దివ్య తేజస్వినిది హత్యేనని నిర్థరణకు వచ్చారు. అయితే.. నిందితుడు మాత్రం తామిద్దం కలిసి చనిపోదామనుకున్నామని, ఎవరికి వారే గాయాలు చేసుకున్నామని చెబుతున్నాడు. అతను చెప్పే దానికి క్షేత్రస్థాయిలో లభించిన ఆధారాలకు పొంతన లేదు. అదేవిధంగా హత్య జరిగిన రోజు ఆ గదిలో వారిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయంపై పోలీసులకు స్పష్టత లేదు.