రాష్ట్రంలో పలు ప్రాథమిక పాఠశాలల పరిస్థితి బాగాలేదని శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ విఠపు బాల సుబ్రమణ్యం అన్నారు. విద్యా ప్రమాణాల్లో ఏపీ 19 స్థానంలో ఉందని నీతి ఆయోగ్ వెల్లడించిందని గుర్తుచేశారు. ఈ పరిస్ధితి మారాల్సిన అవసరం ఉందన్నారు. చైనా, శ్రీలంకలో పాఠశాలలు అద్భుతంగా ఉంటాయని..,రాష్ట్రంలోనూ ఉన్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలలు, బలమైన విద్యా వ్యవస్థ అవసరముందన్నారు. ఎమ్మెల్సీగా ప్రజా సమస్యలపై పోరాటం తనకు తృప్తినిచ్చిందని తెలిపారు.
అభినందన సభ
శాసన మండలి ప్రొటెం ఛైర్మన్‌గా నియమితులైన విఠపు బాల సుబ్రమణ్యానికి విజయవాడలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలే నిజమైన విద్యాలయాలుగా అందరూ భావించేలా ముఖ్యమంత్రి జగన్ పలు చర్యలు తీసుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థను సమూలంగా అభివృద్ది చేయటమే లక్ష్యంగా నాడు-నేడు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక శాసన మండలిలో సాంకేతికంగా పలు ఇబ్బందులు వచ్చాయని..,ఈ సమయంలో పీడీఎఫ్ నిర్మాణాత్మక పాత్ర పోషించిందన్నారు. బాలసుబ్రమణ్యం అనుభవజ్ఞుడు, మేధావి కావడం వల్ల ప్రొటెం ఛైర్మన్‌గా ఎన్నికయ్యారన్నారు.
ఇదీ చదవండి
AP-TS-WATER ISSUE: ప్రాజెక్ట్‌ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా