ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హోరెత్తిన పురపోరు.. ప్రచార బరిలో ప్రధాన పార్టీల ముఖ్యనేతలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

పుర పోరులో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న వేళ.. అభ్యర్థులు ఓట్ల వేటలో మునిగిపోయారు. ప్రధాన రాజకీయ పక్షాల తరఫున ప్రచారంలో పాల్గొన్న ముఖ్యనేతలు.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను వేడుకున్నారు.

Corporation Election
Corporation Election

By

Published : Mar 3, 2021, 8:01 AM IST

హోరెత్తిన పురపోరు.. రంగంలోకి ప్రధాన పార్టీల ముఖ్యనేతలు

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. తూర్పు నియోజకవర్గంలో ఎంపీ కేశినేనినాని, గద్దె రామ్మోహన్‌.. పశ్చిమలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా విస్తృత ప్రచారం నిర్వహించారు. 49వ డివిజన్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి.. ఎమ్మెల్సీ బుద్దా ప్రచారంలో పాల్గొన్నారు. 19వ డివిజన్‌ అభ్యర్థి తరఫున కేశినేని నాని, గద్దె రామ్మోహన్‌ ఓట్లు అభ్యర్థించారు.

36 డివిజన్‌లో సీపీఐ కార్యాలయాన్ని తెలుగుదేశం నేత బొండా ఉమ, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. విజయవాడ అభివృద్ధిపై సీఎం జగన్‌ కనీస దృష్టి పెట్టలేదని బొండా ఉమ విమర్శించారు. ప్రశాంత విజయవాడ కావాలంటే.. తెలుగుదేశానికి మరోసారి మేయర్‌ పీఠం కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు.

విజయవాడ 40వ డివిజన్‌లో జనసేన అభ్యర్థిని గెలిపించాలంటూ ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ ప్రచారంలో పాల్గొనగా.. 36వ డివిజన్‌లో భాజపా అభ్యర్థి ఆర్ముగం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 49 వ డివిజన్‌లో వైకాపా కార్పొరేటర్‌ అభ్యర్థి బొల్లా విజయ్‌కుమార్‌ తరఫున గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రచారం చేశారు. 1వ డివిజన్‌లో ఉద్దంటి సునీత సురేష్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రచారం నిర్వహించారు. రెండేళ్లలోనే వైకాపా అమలుచేసిన సంక్షేమ పథకాలతో ప్రజలందరూ తమవైపే ఉన్నారన్న నేతలు.. బెజవాడ మేయర్‌ పీఠాన్ని గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.

జీవీఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు వినూత్న ప్రచారంతో ఓట్ల వేట కొనసాగించారు. దక్షిణ నియోజకవర్గంలోని 32వ వార్డు తెదేపా అభ్యర్థి పంపాన రాజ్యలక్ష్మి.. దోసెలు వేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. తెలుగుదేశం అభ్యర్థుల తరఫున ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు81 వార్డులో ప్రచారం చేశారు. గాజువాకలో 70వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు పాల్గొన్నారు. విశాఖను కేంద్రం అన్ని విధాలా అభివృద్ధి చేస్తోందన్న ఆయన.. ఇప్పటికే దేశంలో అగ్రగామి స్మార్ట్‌సిటీగా విశాఖను గుర్తించిందన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తిరుపతిలోని 18వ వార్డులో.. తెలుగుదేశం నేత పట్టాభి.. అభ్యర్ధులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ.. తెలుగుదేశాన్ని ఆదరించాలని కోరారు.

ఒంగోలు నగరపాలక సంస్థ పరిథిలోని వివిధ వార్డుల్లో తెలుగుదేశం, వైకాపా విస్తృత ప్రచారం చేశాయి. కర్నూలులో అధికార, విపక్షాలు ఇంటింటి ప్రచారాలతో ఓట్లు అభ్యర్థించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో వైకాపా అభ్యర్థుల తరఫున స్థానిక ఎమ్మెల్యే కుమార్తె నైరుతిరెడ్డి ప్రచారం చేశారు.

ఇదీ చదవండి:వైకాపాకు ఓటేస్తే సుంకాల మోత: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details