రాష్ట్రంలో తొలివిడత కొవిడ్ టీకాను వేయించుకున్న 5 లక్షల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు మలి దశ వ్యాక్సిన్ అందించాలన్న సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. రేపటి నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా పర్యవేక్షించేందుకు యాప్ ఉపయోగపడనుంది. టీకా వేయంచుకున్న వారి వివరాలను వైద్యాధికారులు ఎప్పుటికప్పుడు యాప్‌లో పొందుపర్చాలని కొవిడ్ కమాండ్ కంట్రోల్ అధికారులు సూచించారు.
ప్రతి వైద్యాధికారికి యూజర్ నేమ్, పాస్వర్డ్లను వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిందన్నారు. యాప్‌లో వ్యాక్సినేషన్, లబ్ధిదారుల వివరాలను వారి రిజిస్ట్రేషన్ ఐడీ, మొబైల్ నెంబర్, పేరుతో పరిశీలించవచ్చని పేర్కొన్నారు. నిర్ణీత టైమ్ స్లాట్లకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ప్రతి ఫ్రంట్ లైన్, హెల్త్ వర్కర్ల మొబైల్కు పంపినట్లు తెలిపారు. ఫ్రంట్ లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు నిర్దేశించిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈనెల 20 కల్లా పూర్తి చేయాలన్నారు.