దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో కరోనా డ్రై రన్ నిర్వహించగా..కృష్ణా జిల్లాలో చేపట్టిన డ్రై రన్ విజయవంతంగా ముగిసింది. వాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం రూపొందించిన కొవిన్ యాప్, వెబ్ సైట్, కోల్డ్ చెయిన్, వాక్సినేషన్ కేంద్రాలకు రవాణా, వాహనాల సన్నద్ధత, కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లను యంత్రాంగం పరీక్షించింది.
జిల్లాలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి, ఉప్పులూరు పీహెచ్‌సీ, పూర్ణ హార్ట్ ఇన్‌స్టిట్యూట్, తాడిగడప కృష్ణవేణి కళాశాల, విజయవాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రకాశ్‌నగర్‌లో డ్రై రన్ నిర్వహించారు. ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది 3 గదుల్లో రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్ మరియు వ్యాక్సినేషన్ అనంతరం పరిశీలన కార్యక్రమాలు చేపట్టారు. కొవిన్ యాప్ పరిశీలన, ఇతర సమస్యలపై క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలించారు.
జిల్లాలో 5 కేంద్రాల్లోని నిర్వహించిన డ్రై రన్‌లో ఎలాంటి లోటుపాట్లు కనిపించలేదని సంయుక్త కలెక్టర్ శివశంకర్ అన్నారు. కొవిన్ పోర్టల్ పని తీరు బాగుందని తెలిపారు. కేంద్రం చేసే సూచనలతో వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. డ్రై రన్‌లో సిబ్బంది పనితీరు, వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగుందని వ్యాక్సిన్ వేసుకున్న వారు చెబుతున్నారు.