ప్రభుత్వ అనుమతి లేకపోయినా... కొన్ని క్లినిక్‌లు, ల్యాబ్‌లు నేరుగా కంపెనీ నుంచే కిట్‌లు కొని మరీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అనుమతి ఉన్న ల్యాబ్‌లలో కొన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నాయి. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల కనుసన్నల్లో సాగుతున్నాయి. వీరు అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి బంధుమిత్రులకు పరీక్షలు చేయిస్తున్నారు. తద్వారా అవసరార్థులకు పరీక్షలు చేసేందుకు కిట్‌లు సరిపోవడం లేదు.
దుర్వినియోగం ఇలా:ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ పరీక్షల్లో రోగి నుంచి నమూనాను తీసుకెళ్లి ల్యాబ్‌లో పరీక్షించాలి. ఇది సుదీర్ఘ ప్రక్రియ. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో అక్కడికక్కడే ఫలితం తెలిసిపోతుంది. ప్రభుత్వం ఇప్పటికే సుమారు 9 లక్షల కిట్‌లు కొనుగోలు చేసింది. మరో నాలుగైదు లక్షలు కొనబోతోంది. వైద్యారోగ్యశాఖ ఈ కిట్‌లను పీహెచ్‌సీల స్థాయి వరకు సరఫరా చేసింది. ఇటీవల 300 కిట్‌లు దారిమళ్లిన ఘటనకు సంబంధించి కాకినాడ నగరపాలక సంస్థ వైద్యాధికారిని సరెండర్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేసే మెడికల్ ఆఫీసర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పనిచేసే ఓ ఉద్యోగి, కాకినాడ జీజీహెచ్ ఆర్‌ఎంవో సంతకం ఫోర్జరీ చేసిన లేఖను సమర్పించి జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి కిట్‌లు తీసుకెళ్లిపోయారు. విషయం బయటపడటంతో ఆ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఇలా కిట్లు దుర్వినియోగం అవుతున్నాయి.
భారీగా వసూళ్లు: ప్రభుత్వం సుమారు 40-50 ఆసుపత్రులు, ల్యాబ్‌లకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలకు అనుమతిచ్చింది. కిట్ ధర రూ.450 కాగా, సర్వీస్ ఛార్జీలు కలిపి ఒక్కో పరీక్షకు రూ.750 ఫీజుగా నిర్ణయించింది. కొన్ని ల్యాబ్‌లు ఆ నియమాన్ని పాటించడం లేదు. ప్రభుత్వ అనుమతులు లేని కొన్ని ల్యాబ్‌లు పరీక్షలు చేసేస్తున్నాయి. ‘కిట్‌లు బ్లాక్‌లో దొరుకుతున్నాయి. మొదట్లో ఒక్కోటి రూ.950కి వచ్చేది. గత నెలలో రూ.1,200-1,300 తీసుకున్నారు. ఇప్పుడు రూ.1,800కి పెంచేశారు. పరీక్ష చేయడానికి పీపీఈ వేసుకుని వెళ్లాలి. ఆ ఖర్చు కలిపి ఒక్కో పరీక్షకు రూ.4,500 తీసుకుంటున్నాం’ అని విశాఖలో అనధికారికంగా పరీక్షలు చేస్తున్న ఒక వ్యక్తి తెలిపారు.