ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆందోళన వద్దు.. జాగ్రత్తలు ముద్దు - కరోనాతో ఆందోళన వద్దు

యావత్తు ప్రపంచం వెన్నులో కరోనా వణుకు పుట్టిస్తోంది. ఈ మహమ్మారి ఏ తీరానికి తీసుకెళ్తుందోనని ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంట్లో చిన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంటి నుంచి వారు బయట అడుగు పెడుతుంటే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆవేదనకు గురవుతున్నారు.

డాక్టర్‌ దినేష్‌ చిర్ల, చిన్నపిల్లల ఐసీయూ నిపుణులు
డాక్టర్‌ దినేష్‌ చిర్ల, చిన్నపిల్లల ఐసీయూ నిపుణులు

By

Published : Apr 17, 2020, 11:38 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, ఇటలీ, అమెరికా దేశాల బాధితుల డేటాను పరిశీలిస్తే.. 19 ఏళ్ల లోపు చిన్నారుల్లో కేవలం 2-5 శాతం మంది మాత్రమే కరోనా ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో కూడా 90 శాతం పిల్లల్లో సాధారణ లక్షణాలేనని తెలిపారు. కేవలం 10 శాతం మందిలో కొంత తీవ్రత ఎక్కువగా కన్పించిందని ఇందుకు అనేక కారణాలు దోహదం చేశాయని పేర్కొంటున్నారు. అది కూడా ఏడాదిలోపు పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. మన వద్ద కూడా పెద్దల్లో వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండడంతో ఆ ప్రభావం చిన్నపిల్లలపై కన్పిస్తోంది. ప్రస్తుతం పెద్దలతోపాటు ఇరవై మంది వరకు పిల్లలు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలపై ప్రభావం తక్కువే...

కరోనా సోకిన చిన్నారుల్లో 90 శాతం మందిలో తక్కువ, మధ్యస్తంగా లక్షణాలు కన్పిస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటుంది. చికిత్సతో తగ్గిపోతుంది. కేవలం 10 శాతం పిల్లల్లో కొన్నిసార్లు ఐసీయూ చికిత్సలు అవసరమవుతాయి. కరోనా బాధితులను పరిశీలిస్తే చిన్నారుల మరణాల రేటు చాలా తక్కువ.

* అధ్యయనాల ప్రకారం శరీరంలోని ఏసీఈ రెస్పెక్టర్‌ బ్లాకర్‌ ఎంజైమ్‌పై కరోనా వైరస్‌ ప్రభావం చూపుతుంది. అయితే 19 ఏళ్లలోపు పిల్లలు, యువకుల్లో ఈ ఏంజైమ్‌ అభివృద్ధి పెద్దలతో పోల్చుకుంటే తక్కువ. పిల్లల్లో కరోనా ప్రభావం ఎక్కువ చూపక పోవడానికి ఇది కూడా ఒక కారణమని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

* ముఖ్యంగా కరోనా వైరస్‌ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అప్పటికే ఆస్తమా, కేన్సర్‌ తదితర సమస్యలతోపాటు పొగతాగే వారిలో ముప్పు ఎక్కువ. పిల్లల్లో ఇలాంటి అనారోగ్య ఇబ్బందులు చాలా తక్కువ. అంతేకాక పెద్దలతో పోల్చితే పిల్లల్లో ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుంది. స్వతహాగా ఉన్న వ్యాధి నిరోధక శక్తి కూడా వైరస్‌ను అడ్డుకుంటుంది.

* ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల చాలా మంది పిల్లలను అసలు ఇంటి నుంచి బయటకు పంపించడం లేదు. మన దేశమే కాదు.. ఇతర దేశాల్లోనూ అంతే. పిల్లలు వైరస్‌ బారిన పడకపోవడానికి ఇది కూడా ప్రధాన కారణం. అంతేకాక పిల్లలందరికీ ప్రభుత్వం బీసీజీ లాంటి టీకాలు అందిస్తోంది. ఈ ఇమ్యూనిటీ కూడా పిల్లలను కాపాడుతోంది.

* ఏడాదిలోపు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహార లేమి, క్యాన్సర్లు, ఊపిరితిత్తుల ఇబ్బందులు ఉన్నవారిలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలు ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లు, చేతులు కడుక్కొని రావాలి. స్నానం చేయడం మంచిది. జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. మాస్క్‌లు ధరించాలి.

* సాధారణ జలుబు, దగ్గు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2-3 రోజులు లేదంటే వారంలో తగ్గిపోతాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా సాధారణ లక్షణాలు కన్పించినా వైద్యుల అభిప్రాయం తీసుకోవడం ఉత్తమం. ఆసుపత్రికి తీసుకెళ్లడం కంటే ఆన్‌లైన్‌ లేదంటే వీడియో కాల్‌ ద్వారా వైద్యులను సంప్రదించవచ్చు.

* తీవ్ర జ్వరం, ఎక్కువ సార్లు శ్వాస తీసుకోవడం, ఏమీ తినక పోవడం, వీరేచనాలు, మత్తుగా ఉండటం, గొంతు నొప్పి, పొడి దగ్గు, కండరాల నొప్పులు లాంటివి ఉన్నట్లు పిల్లలు చెబితే.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

డాక్టర్‌ దినేష్‌ చిర్ల, చిన్నపిల్లల ఐసీయూ నిపుణులు

ఇదీ చూడండి:విదేశాల్లోనూ వేల మంది భారతీయులకు కరోనా!

ABOUT THE AUTHOR

...view details