రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వరకు 5247 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 1,573 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు(రికవరీ) 57.09 శాతం, మరణిస్తున్నవారు 1.61 శాతంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో రికవరీ 48.88 శాతం, మరణాలు 2.80 శాతంగా ఉన్నాయి.
సోకడం తగ్గితే.. మరణాలు తగ్గుతాయి
లాక్‌డౌన్ నిబంధనల సడలింపులతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే మరణాల సంఖ్యా పెరిగే అవకాశం ఉంది. వైరస్ బారినపడడాన్ని తగ్గించగలిగితే మృతుల సంఖ్య తగ్గుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా..60, ఆపై సంవత్సరాలు వయసు కలిగిన వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని సూచిస్తున్నారు. వైరస్ బారినపడిన వారిలో కోలుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. వైరస్ సోకినప్పటికీ ‘హోం క్వారంటైన్’లో ఉండి కోలుకుంటున్నవారూ ఉంటున్నారు.
వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి
కరోనా వైరస్ మరణాలు పెరుగుతున్నందున దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా ముఖ్యంగా 60 సంవత్సరాలు ఉండి రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులతో బాధపడే వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించింది. వైరస్ అనుమానిత లక్షణాలు లేకున్నా కట్టడి ప్రాంతాల్లో (కంటైన్‌మెంట్) నివాసం ఉంటున్నట్లయితే తప్పకుండా నిర్థరణ పరీక్షలు జరపాలని తెలిపింది. రోగ నిరోధక శక్తి పెంచే జింక్ 20ఎంజీ మాత్రలను దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి పంపిణీ చేయాలని సూచించింది.
ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నదిలా..
* కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నా ఆస్పత్రులకు వెళ్లడంలో జాప్యం.. అవగాహన లేక.. వేచి చూసే ధోరణి అవలంబించడంవల్ల..
* అనుమానిత లక్షణాల గురించి ఎవరికీ చెప్పకుండా ఉండటంవల్ల..
* బయటకు వెళ్లొచ్చే వారివల్ల ఇంట్లోని వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు వైరస్ బారినపడి..
* ఊపిరితిత్తుల సమస్యలతోనే చివరి నిమిషంలో ఆస్పత్రులకు వెళ్తుండటంవల్ల..