ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాఫీలందించేవారికి కాసులాడటం లేదు

రెండు కాఫీ.. ప్లేట్‌ ఇడ్లీ పార్శిల్‌.. భోజనం రెడీ.. ఇలాంటి మాటలు రెండు నెలలుగా వినిపించడం లేదు. లాక్‌డౌన్‌తో హోటల్‌ పరిశ్రమ మూతపడటమే దీనికి కారణం. దీంతో ఈ రంగంపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయారు. చిన్న హోటళ్లతో బాటు స్టార్‌ హోటళ్లలో పనిచేసే వారి ఆర్థిక పరిస్థితి తల్లకిందులైంది.

corona effect on hotels and restaurants
corona effect on hotels and restaurants

By

Published : Jun 5, 2020, 5:46 AM IST

ప్రభుత్వం మళ్లీ హోటళ్లలో పార్శిళ్లు తీసుకెళ్లటానికి అనుమతి ఇచ్చినా గతంలో మాదిరి ఉపాధి దొరికే అవకాశం లేదని హోటల్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా భయంతో ప్రజలు ఇప్పటికే ఇంటి వంటకు అలవాటు పడ్డారని.. ఇప్పట్లో హోటళ్లకు వస్తారన్న ఆశ లేదని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ రహదారుల పక్కన ఎక్కువగా ఉండే దాబాల్లో బిహార్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ నుంచి ఉపాధి కోసం వచ్చి పనిచేసే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఒక మోస్తరు దాబాలో 20 మంది పనిచేస్తారు. లాక్‌డౌన్‌తో రవాణా సదుపాయం లేక ఎక్కువ మంది దాబాల్లోనే ఉన్నారు. శ్రామిక్‌ రైళ్లు ఏర్పాటు చేసిన తర్వాత చాలామంది సొంత ప్రాంతాలకు వెళ్లారు. చైనీస్‌, మాంసాహార వంటల తయారీలో వారికి ప్రత్యేకత ఉంది. ఇటీవలే సొంత ఊళ్లకు వెళ్లిన వాళ్లు ఇప్పట్లో తిరిగి వచ్చే పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్న వంట మాస్టర్‌తో వ్యాపారం ప్రారంభిస్తే.. రుచిలో మార్పు వస్తే పేరు దెబ్బతింటుందని కొందరు దాబా యజమానులు భయపడుతున్నారు. దీనివల్ల దాబాల్లో పనిచేసే స్థానిక కూలీలకు ఇప్పట్లో ఉపాధి దొరికే పరిస్థితి లేదు.

  • రెండు నెలలూ ఆదాయం లేదు

రెండు నెలలుగా హోటల్‌ మూతపడటంతో ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందని రాంబాబు అనే హోటల్‌ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్న పిల్లలు.. ఇంట్లో ఇబ్బందులు చూడలేక మార్కెట్‌ దగ్గర కూరగాయలు తూకం వేయటానికి, బస్తాలు మోయటానికి వెళ్లినట్లు చెప్పారు.
* లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా హోటల్‌ యజమాని నుంచి తీసుకున్న కొద్దిపాటి అప్పుతో ఇంటి అద్దె కట్టుకుని, కుటుంబాన్ని పోషించాల్సి వచ్చిందని లాజర్‌ అనే మరో వ్యక్తి వాపోయారు. కొన్నేళ్లుగా ఇదే పనికి అలవాటు పడిన తాను ఇతర పనులకు వెళ్లలేనన్నారు.

  • 1.5 లక్షల మందికి ఆధారం

* రాష్ట్రంలో చిన్న, పెద్దా హోటళ్లు కలిపి సుమారు 40 వేల వరకు ఉన్నాయి.
* వంట, సప్లయర్లు, గిన్నెలు శుభ్రం చేయటానికి, కూరగాయలు తరగటం వంటి పనుల రూపేణా చిన్న హోటళ్లలో కనీసం అయిదుగురికి ఉపాధి దొరుకుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 లక్షల మంది వరకు హోటల్‌ పరిశ్రమపై ఆధారపడ్డారు.
* లాక్‌డౌన్‌తో పరిశ్రమ మూతపడి కార్మికులంతా సగటున రోజుకు రూ.400-500 ఆదాయం కోల్పోయారు.
* వేరే పనులకు వెళ్దామన్నా దొరక్క రెండు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు.
* ఒకే హోటల్‌లో ఎక్కువ కాలం నుంచి పని చేస్తున్న వారికి కొంతమంది హోటళ్ల యజమానులు 50 శాతం జీతం ఇచ్చారు.

ఇదీ చదవండి: భారత్​కు సాయం కోసం.. బుజ్జి ఎన్​ఆర్​ఐ సాహసం

ABOUT THE AUTHOR

...view details