కరోనా మలిదశ ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని తీవ్రంగా భయపెడుతోంది. కరోనా కారణంగా ఏపీ సచివాలయంలో మూడు రోజుల్లోనే నలుగురు మృతి చెందటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తక్షణం తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలంటూ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హైకోర్టులో ఇద్దరు, రాష్ట్రవ్యాప్తంగా మరో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మృతి చెందటంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా కారణంగా ఉద్యోగులు రాకపోవటంతో సచివాలయం ఖాళీగా మారింది.
కుటుంబ సభ్యుల్లోనూ..
ఏపీలో కరోనా మలిదశ తారాస్థాయికి చేరుతోంది. వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతుండటంతో పాటు మరణాలు కూడా గరిష్ట స్థాయిలోనే నమోదు అవుతున్నాయి. ప్రత్యేకించి కరోనా తీవ్రతపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీ సచివాలయంలో మూడు రోజుల వ్యవధిలోనే నలుగురు ఉద్యోగులు కరోనా కారణంగా మృతి చెందటంతో వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకుతుండటంతో ఉద్యోగుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
హాట్‌స్పాట్‌గా సచివాలయం
ఇప్పటికే సచివాలయంలో పని చేస్తున్న సుమారు 40 నుంచి 50 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. వరుసగా మూడు రోజుల్లో నలుగురు సచివాలయ ఉద్యోగులు కరోనా తో మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వి.పద్మారావు కరోనాతో మృతి చెందారు. పంచాయతీరాజ్ శాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న ఆయన సతీమణి శాంత కుమారి ఇవాళ కరోనాతో కన్నుమూశారు. అటు హోం శాఖలో రికార్డ్ అసిస్టెంటుగా పని చేస్తున్న ఏఎస్ఎన్ మూర్తి కూడా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజుల క్రితం సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న జి. రవికాంత్ కూడా కరోనాతో మృతి చెందారు. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో ఒక్కసారిగా భయాందోళనలు కమ్ముకున్నాయి. సచివాలయంతో పాటు ఏపీ హైకోర్ట్ లో పని చేస్తున్న శ్రీలత, సుబ్రమణ్యం కూడా ఇవాళ కరోనాతో మృతి చెందారు. తక్షణం తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలంటూ ఉద్యోగులు ప్రభుత్వానికి నివేదించారు.