రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిలో కరోనా కలవరం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 4500 మంది ఆర్టీసీ సిబ్బంది కరోనా బారిన పడ్డట్లు సంస్థ ప్రకటించింది. కరోనా కారణంగా 72 మంది మరణించినట్లు తెలిపింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. కార్మికుల ఒక రోజు వేతనాన్ని జమ చేసి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో రవాణాశాఖ మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేస్తామని తెలిపారు.
కరోనా బారిన పడకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఎండీ ఆదేశించారు. సిబ్బంది మాస్కు ధరించడం, శానిటైజర్ వినియోగం సహా... భౌతికదూరం తప్పక పాటించాలని సూచించారు. కరోనా బారినపడిన వారిని వెంటనే వైద్య కేంద్రాలకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్ధితుల్లో నిర్లక్ష్యానికి తావివ్వవద్దని ఆదేశించారు. సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా వైరస్ బారిన పడుతోన్న దృష్ట్యా.. వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.