ఐదున్నర గంటలు.. 4 ఆసుపత్రులు
కరోనా బారిన పడి గంటల వ్యవధిలో దంపతులు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లివాసులను కంటతడి పెట్టించింది. పట్టణానికి చెందిన వ్యాపారి చిన్నకుమార్తె అమెరికాలో ఉన్నారు. ఆమెకు సహోద్యోగితో ఆగస్టులో వివాహం చేసేందుకు నిర్ణయించారు. వ్యాపారి కుటుంబం ఇటీవల విజయవాడలో షాపింగ్ చేశారు. ఆరు రోజుల కిందట జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో దంపతులిద్దరూ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్ కొరత ఏర్పడిందని అక్కడి వైద్యులు చెప్పడంతో శనివారం సాయంత్రం అంబులెన్స్‌లో ఇద్దరినీ బంధువులు గుంటూరు తరలించారు. విదేశాల్లో ఉన్న కుమార్తెలు అక్కడి నుంచే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకల కోసం ప్రయత్నించారు. ఒక పడక దొరకడంతో వ్యాపారి (60)ని చేర్చారు. ఆయన భార్య (54) అత్యవసర వైద్యసేవలకు బంధువులు నాలుగు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఐదున్నర గంటల పాటు ఆమె అంబులెన్స్‌లోనే ఉన్నారు. రాత్రి 11 గంటలకు గుంటూరు సర్వజనాసుపత్రిలో పడక దొరికింది. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం గుండెపోటుతో చనిపోయారు. వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త కూడా కన్నుమూశారు. వీరిది ప్రేమ వివాహం.. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. స్థానికంగా ఎన్నో సేవాకార్యక్రమాలు, సహాయాలు చేసేవారని గుర్తుచేసుకుంటూ పట్టణవాసులు కంటతడి పెట్టారు. తల్లిదండ్రులను కడసారి చూసేందుకూ కుమార్తెలు రాలేని దయనీయ పరిస్థితి.
కుమారుడి మృతితో ఆగిన తండ్రి గుండె
ఓ ఉపాధ్యాయుడు కరోనాతో చనిపోగా... తట్టుకోలేక తండ్రి గుండె ఆగి మరణించిన విషాదమిది. విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం తామరం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజారావు(54) కుమారుడి వివాహం మే 13న జరగాల్సి ఉంది. అందుకోసం శుభలేఖలు పంచుతూ రాజారావు కరోనా బారిన పడ్డారు. ఆయనను విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. రాజారావు మృతి విషయాన్ని మధ్యాహ్నం వరకూ తల్లిదండ్రులకు చెప్పలేదు. ఎట్టకేలకు తండ్రి సుబ్బారావు(88)కు విషయం తెలియడంతో తట్టుకోలేని ఆయన గుండెపోటుతో మధ్యాహ్నం చనిపోయారు.
పడకలు దొరక్క.. మృత్యువాత