కొవిడ్ (covid) నియంత్రణ, వాక్సినేషన్‌పై (vaccination) సీఎం జగన్ (cm jagan) సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వైరస్ మరింత తగ్గుముఖం పట్టిందని వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. కరోనా పాజిటివిటీ రేటు 3.66 శాతంగా ఉందని.. 5 జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువే ఉందని.. గణాంకాలతో సహా వెల్లడించారు. కరోనా రికవరీ రేటు సైతం.. 97.47 శాతంగా ఉందన్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న సీఎం...కర్ఫ్యూను (Curfew Relaxation) మరింతగా సడలించాలని అధికారులను ఆదేశించారు.
ఉభయ గోదావరి మినహా మిగతా 11 జిల్లాల్లో.. రాత్రి 10 గంటల వరకూ కర్ప్యూ సడలించాలని నిర్దేశించారు. థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్స్, ఫంక్షన్ హాల్స్‌కు 50 శాతం పరిమితితో అనుమతించారు. కేసులు అంతగా తగ్గని..ఉభయ గోదావరి జిల్లాల్లో.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూ (Curfew Relaxation) సడలింపులిచ్చారు. ఆ జిల్లాల్లో సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాలన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కిందకు దిగొచ్చేదాకా ఆంక్షలు కొనసాగించాలన్నారు. ఈ నెల 8 నుంచి కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్దేశించారు. థియేటర్లలో సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా చూడాలన్నారు.
సమీక్షలో భాగంగా రాష్ట్రంలో 97 చోట్ల తలపెట్టిన 134 ఆక్సిజన్ ప్లాంట్ల (oxygen plants) పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. 15 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు... సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రెండు నెలల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల పనులు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ (vaccination) ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు. 45 ఏళ్లు దాటిన వారికి వాక్సినేషన్ 90 శాతం పూర్తైన తర్వాత ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఐదేళ్లు దాటిన పిల్లలున్న తల్లులకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గర్భిణులకూ వాక్సినేషన్ చేయాలని సూచించారు.