కరోనా మహమ్మారి రాష్ట్రంలో ఎన్నో కుటుంబాల్లో జీవితాంతం కోలుకోలేని విషాదం మిగిల్చింది. కుటుంబ పెద్దలను కాటేయడంతో ఇప్పుడు ఎంతోమంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అలాంటావిడే ఈ రామతులసమ్మ..! కట్టుకున్న భర్త పక్షవాతంతో చనిపోయాడు. కూలిపనిచేసే కుమారుడి అండతో కాలం వెళ్లదీద్దామనుకుంటే.. కరోనా ఆ ఆశను చిదిమేసింది. భర్త చనిపోయిన.. నెలకే కుమారుడినీ కరోనా ఎత్తుకెళ్లింది. ముదిమి వయసులో ఇప్పుడు అనాథగా మిగిలారు రామతులసమ్మ.! తనకు బతికే దారేదీ కనిపించడం లేదని కుమిలిపోతున్నారు.
ఇలాంటి విషాద గాథే.. వరలక్ష్మిది. విజయవాడలోని సుందరయ్య నగర్ కట్టపై ఉంటోంది. కరోనాతో భర్త కళాధర్ దూరమయ్యాడు. చూస్తే.. ముగ్గురు ఆడపిల్లలు, అంతా ఐదేళ్లలోపువాళ్లే.! ప్రస్తుతం తల్లివద్దే ఉంటున్న వరలక్ష్మి పిల్లలను ఎలా పెంచి పెద్దచేయాలో దిక్కుతోచడంలేదంటున్నారు.
భవిష్యత్ ఏమిటో అర్థంకాని స్థితిలో ఉన్నారు.. మేరీ భవానీ. భర్త ఆరోగ్యం కోసం చేసిన అప్పులు తప్ప తనకు భవిష్యత్ ఏమీ కనిపించడంలేదని మేరీ వాపోతున్నారు. ఈమె భర్త కూడా..కరోనాతో కాలం చేశారు. మేరీ భవానీకి ఒక పాప.. ఇక ఆ చిన్నారిని పెంచి పెద్ద చేసే బరువుబాధ్యతలన్నీ మేరీ భవానీ ఒక్కరే మోయాల్సిందే.