‘మూడు రోజుల క్రితం నగర యువకుడు.. తన మిత్రులు ముగ్గురితో సిగరెట్ పంచుకున్నాడు. దీంతో అప్పటికే అతనికి ఉన్న కొవిడ్ ఆ ముగ్గురికీ వ్యాపించిందని తేలింది..’ ఇది సిగరెట్ వల్ల ప్రత్యక్షంగా కలిగిన ముప్పు అయితే.. పరోక్షంగానూ దీనివల్ల సమస్య ఉంది. సాధారణ జనంతో పోలిస్తే 14శాతం ఎక్కువ కరోనా ప్రభావం పొగరాయుళ్లపై ఉంటుందని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇదే విషయాన్ని ఓ నివేదికలో వెల్లడించింది.
గత్తర పాకేదెలా..?
పొగతాగడం వల్ల కరోనా వ్యాపించే అవకాశాలు 14రెట్లు ఎక్కువున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకడం వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుందనే విషయం తెలిసిందే. పొగతాగే వాళ్లు చేతివేళ్లను ప్రతిసారీ నోటి దగ్గరకు తీసుకెళ్తుంటారు. దీని ద్వారా శరీరంలోనికి వైరస్‌కు స్వాగతం పలుకుతున్నట్లే. పొగాకు శ్వాసకోశ వ్యవస్థను బలహీనపరుస్తుంది.
పొగాకు వల్ల కరోనా మాత్రమే కాదు అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగానే పొగ తాగేవారిలో రక్తనాళాల్లో గడ్డకట్టే సమస్య ఉంటుంది. ఇప్పుడు కరోనాగానీ తోడైతే ఇక ప్రాణాలకు ముప్పే.