corona cases in TS: కొవిడ్ మహమ్మారి రెండేళ్లుగా రూపు మార్చుకుంటూ ప్రజలను ఏమార్చి దాడి చేస్తోంది. కరోనా కోరల నుంచి బయట పడుతున్నామని సంబరపడే లోపే ఒమిక్రాన్‌గా రూపాంతరం చెంది మరోమారు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు బయటపడక పోయినా విదేశాల నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్ అని తేలింది. బాధితురాలికి టిమ్స్‌లో మహిళకు చికిత్స అందిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు రావాల్సి ఉంది.
క్రమంగా పెరుగుతున్న కేసులు..
corona cases increase: తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్‌లో రాష్ట్రంలో రోజుకు సరాసరి 157 వరకు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య రెండొందలకు చేరువవుతుండటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోనూ కరోనా కేసుల సంఖ్యలో మార్పు కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీలో కేసుల పెరుగుదల..
covid cases in GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు సుమారు 70 నుంచి 80 వరకు కరోనా కేసులు వస్తున్నాయి. రంగారెడ్డిలో 15 , మేడ్చల్ జిల్లాలో 20 వరకు కేసులు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్ అర్బన్‌లో నిత్యం 10 వరకు కేసులు వస్తున్నాయి. ములుగులో కరోనా కేసులు సున్నాకు చేరుకున్నాయనుకుంటున్న తరుణంలో.. రోజు ఒకటి రెండు కేసులు వస్తున్నాయి.