టైలరింగ్, ఫ్యాబ్రిక్ డిజైన్‌లలో సంతరించుకున్న ఆధునిక మార్పులు మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపించాయి. గతంలో ఉండే బ్లౌజ్, శారీల స్థానంలో ఆధునిక డిజైన్‌లు, ఫ్యాబ్రిక్‌లు వేసిన దుస్తుల వాడకం పెరింగింది. టైలరింగ్ రంగంలో ఆధునికత చోటు చేసుకుంది. మగ్గంతో వేసిన పనులతో కూడిన దుస్తులకు ప్రాధాన్యం పెరగటంతో.. మహిళలు ఈ రంగాన్ని ఆదాయార్జనగా మలచుకున్నారు.
ఫ్యామిలీ, స్నేహితుల సర్కిళ్లలో జరిగే వివిధ రకాల వేడుకలే వీరికి ఆర్డర్లు తెచ్చే మార్గాలయ్యాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే మగ్గం వర్క్‌కు ఎక్కువ గిరాకీ ఉంటుంది. పెళ్లికూతురుతోపాటు వారి తరపు బంధువులు, పెళ్లికొడుకు తరపు మహిళలు కూడా మగ్గం వర్క్‌పై తయారు చేసిన దుస్తులనే వాడేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. నిత్యం మార్కెట్ ఉండే ఈ వ్యాపారం పట్ల మహిళలకు తమకున్న పరిచయాలతో ఆర్థిక స్తోమతను పెంచుకుంటున్నారు.
ఇలా అన్ని వర్గాల మహిళలకు ఉన్న ఈ స్వయం ఉపాధిని కరోనా తీవ్రంగానే కుదేలు చేసింది. ఆర్డర్లు లేక, పెట్టుకున్న పరిశ్రమలకు అప్పులు కట్టలేక, దుకాణాలకు అద్దెలు చెల్లించలేక, పనివారికి వేతనాలు ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ సమయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్యాకేజీలేవీ మహిళల స్వయం ఉపాధికి ఉపయోగపడేలా లేవని వాపోతున్నారు.