ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భానుడి భగభగలకు ఆర్టీసీ కూలర్ల ఉపశమనం

మండే ఎండలతో ఇబ్బందులు పడుతోన్న ప్రయాణికులకు కాస్త ఉపశమనాన్ని కల్పించదలచారు కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారులు. విజయవాడ బస్టాండ్​లో కూలర్లు ఏర్పాటు చేసి భానుడి భగభగ నుంచి జనాలకు ఊరటనిస్తున్నారు. ఇప్పటి వరకు ఇబ్బందులు పడిన ప్రజలు... చల్లని గాలి చెంత సేదతీరుతున్నారు.

By

Published : Apr 29, 2019, 8:23 AM IST

భానుడి భగభగలకు ఆర్టీసీ కూలర్లు ఉపశమనం

భానుడి భగభగలకు ఆర్టీసీ కూలర్లు ఉపశమనం

ఆసియాలోనే అతి పెద్ద బస్టాండ్లలో ఒకటైన విజయవాడ బస్​ స్టేషన్​ నుంచి రోజూ 3 వేలకుపైగా బస్సులు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు నడుస్తుండగా... లక్షమందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. గతకొద్ది రోజులుగా ఎండలు పెరగడంతో... వేడిగాలులకు బస్టాండ్​లో వేచి ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొద్దిసేపైనా కూర్చోలేని పరిస్ధితి ఏర్పడింది. ప్రయాణికుల ఇబ్బందులు చూసిన ఆర్టీసీ అధికారులు ప్రయాణ ప్రాంగణాన్ని శీతలమయం చేశారు. బస్టాండ్​లో ప్లాట్ ఫాంలపై పెద్ద పెద్ద కూలర్లను ఏర్పాటు చేశారు. ఉదయం వేడిగాలులు ప్రారంభమైన సమయం నుంచి రాత్రి వరకు నిరంతరం పనిచేసేలా ఏర్పాటు చేశారు. కూలర్ల నుంచి వచ్చే చల్లని గాలి చెంత ప్రయాణికులు కాసేపు సేద తీరుతున్నారు. ఉక్కపోత, వేడి గాలులతో ఇబ్బంది పడి ఏడ్చే చిన్నారులు ఇప్పుడు హాయిగా ఆడుకుంటున్నారు. ఎండలకు తట్టుకోలేని వృద్ధులకూ ఉపశమనం కలుగుతోంది.
బస్టాండ్ లోనే ఏర్పాటు చేసిన ఎల్​ఈడీ స్క్రీన్​లో వినోద కార్యక్రమాలు వీక్షిస్తూ ఎండ తగ్గే వరకు వేచి చూస్తున్నారు. వాతావరణం కాసింత చల్లబడ్డాక బస్సెక్కి వెళ్తున్నారు. ఎండల ధాటికి మధ్యాహ్నం వేళల్లో బోసి పోయి కనిపించే పండిట్ నెహ్రూ బస్టాండ్​లో కూలర్ల ఏర్పాటు అనంతరం ప్రయాణికులతో కళకళలాడుతోంది. ఆర్టీసీ అధికారులు తీసుకున్న చర్యలను ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికులతోపాటు విధులు నిర్వహించి వచ్చిన డ్రైవర్లు, కండక్టర్లు సైతం విరామ సమయంలో కాసేపు ఇక్కడ కూర్చుని సేద తీరుతున్నారు. చల్లగా ఉండటంతో బస్టాండ్​లో ప్రయాణికులు పెరగడంతో ఆర్టీసీకి ఆదాయం వస్తోందని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details