ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వంటనూనె సలసల.. రెండు రోజుల్లోనే లీటరుకు రూ.20కి పైగా పెరుగుదల

oil prices are high in Vijayawada: వంట నూనెల ధరలు భగ్గుమన్నాయి. లీటరుపై రూ.10 నుంచి రూ.25 వరకు పెరిగాయి. అదేమంటే అక్కడెక్కడో యుద్ధం అంటగా? అందుకే పెరిగాయనే సమాధానం వస్తోంది. ధరల పెరుగుదల కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

cooking oil
cooking oil

By

Published : Feb 27, 2022, 4:42 AM IST

oil prices are high in Vijayawada: విజయవాడలోని ఒక కార్పొరేట్‌ మాల్‌లో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు లీటరు పామాయిల్‌ ధర రూ.128 ఉండగా.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రూ.149 అయింది. అంటే రెండు గంటల్లోనే లీటరుకు రూ.21 చొప్పున పెరిగింది. ఈ పెరుగుదల ఎంతవరకో తెలియడం లేదని, కరోనా సమయంలో ధరలకు మించి పెరిగే అవకాశం ఉందంటున్నారని చిల్లర వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదల కారణంగా పేద, మధ్యతరగతి వర్గాల ఇంటి ఖర్చు మరింత పెరుగుతోంది. రోడ్డు పక్క తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల ఆదాయానికి చిల్లు పడుతోంది. యుద్ధం మొదలై రెండు రోజుల్లోనే నూనె ధరలు పెరగడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గోదాముల్లో ఉన్న సరకుకే ధరలు పెంచేసి అమ్ముతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇష్టారాజ్యంగా ధరల పెంపు
శనివారం సాయంత్రానికి వంట నూనెల ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉన్నాయి. సగటున వేరుసెనగ నూనె రూ.170, పొద్దుతిరుగుడు నూనె (సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌) రూ.160, పామాయిల్‌ రూ.150 వరకు పలుకుతోంది. రైస్‌రిచ్‌, రైస్‌బ్రాన్‌ నూనెల ధరలూ లీటరుకు రూ.20 వరకు పెరిగాయి. విజయవాడ చిల్లర మార్కెట్లో లీటరు పామాయిల్‌ రూ.158, పొద్దుతిరుగుడు నూనె రూ.175, వేరుసెనగ రూ.175 చొప్పున విక్రయిస్తున్నామని వ్యాపారులు వివరించారు. కొన్నిచోట్ల వేరుసెనగనూనె లీటరు రూ.182, పొద్దుతిరుగుడు నూనె రూ.180 అని బోర్డులు పెట్టారు. హోల్‌సేల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో తామూ పెంచక తప్పలేదని వివరించారు.

  • కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ వెబ్‌సైట్లోని సమాచారం మేరకు శనివారం దేశవ్యాప్త సగటు ధరలు పరిశీలిస్తే.. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.152.30, పామోలిన్‌ రూ.135.78, వేరుసెనగ నూనె రూ.173.40 చొప్పున ఉంది. క్షేత్రస్థాయి ధరలకు వీటికీ పోలికే లేదు.
  • గత నెల ఇదే సమయంలో ప్రధాన నౌకాశ్రయాల్లో దిగుమతి అయిన పామోలిన్‌ ధర లీటరు రూ.119- 120 మాత్రమే ఉంది. ఇప్పుడు లీటరుకు రూ.25 నుంచి రూ.30 పైనే పెరుగుదల నమోదైంది.
  • వేరుసెనగ నూనెపై దిగుమతుల ప్రభావం అంతగా లేకున్నా.. దాని ధరలూ లీటరుకు రూ.10 నుంచి రూ.20 పైనే పెంచేయడం గమనార్హం. లీటరు ధర గరిష్ఠంగా రూ.165 నుంచి రూ.175 మధ్యకు చేరింది.

రోజుకు రూ.150 అదనపు భారం
శుక్రవారంతో పోలిస్తే శనివారం లీటరుకు రూ.30 వరకు పెరిగింది. రోజుకు 5 లీటర్ల పామోలిన్‌ వినియోగిస్తే రూ.150 వరకు అదనంగా ఖర్చవుతోందని చిల్లర వ్యాపారులు పేర్కొంటున్నారు. నూనె ధరలు పెరిగాయని వెంటనే తినుబండారాల ధరల్ని పెంచలేం కదా? అని కృష్ణవేణి పాఠశాల రోడ్డులో వ్యాపారం చేసే కృష్ణ వాపోయారు. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే.. మేమూ అల్పాహార ధరలు పెంచాల్సి వస్తుందని వివరించారు.

ఇదీ చదవండి:భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎక్కడ ఎంతంటే..?

ABOUT THE AUTHOR

...view details