Contract Employees: ముఖ్యమంత్రి జగన్ తమకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తారని ఎదురుచూసిన కాంట్రాక్టు ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. తాజాగా బయటపెట్టిన అశుతోష్ మిశ్ర వేతన సవరణ నివేదిక ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు చల్లనిమాట చెప్పింది. అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని సిఫార్సు చేసింది. పాదయాత్ర హామీ నెరవేరుతుందని మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ఉద్యోగులకు పీఆర్సీ సిఫార్సుతోనైనా సర్కారు కదులుతుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో పీఆర్సీ సిఫార్సులు ఇవీ..
*సామర్థ్యం ఆధారంగా అర్హత సాధించి కాంట్రాక్టు ఉద్యోగం పొందినవారిని ఖాళీ ఉన్న శాశ్వత పోస్టుల్లో నియమించాలి. నిర్దిష్ట భర్తీ విధానం పాటించి కాంట్రాక్టు ఉద్యోగాలు పొందితే వారిని శాశ్వత పోస్టుల్లోకి తీసుకోవాలి. భవిష్యత్తులో ఈ ఉద్యోగాల భర్తీలో పోటీపడే ఇతర అభ్యర్థులతో సమానంగా వారూ అర్హత సాధించాలనే నిబంధనతో ఆ పోస్టుల్లో నియమించాలి.
*ఈ విధానం ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగాలు పొందనివారి అర్హతల ఆధారంగా సంతృప్తి చెందితే భవిష్యత్తులో చేపట్టే పోస్టుల భర్తీలో వారికి అవకాశం ఇవ్వాలి.
*ఇకముందు శాశ్వత పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో నింపకూడదు.
మాట ఇచ్చారు.. తీర్చేదెప్పుడు?
*కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశంపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. 2019 జులై 10న దీనిపై ఉత్తర్వులు ఇచ్చారు. ఇంకా నివేదిక సమర్పించలేదు.
*2019 నవంబరులో మరో కమిటీ ఏర్పాటైంది. మంత్రివర్గ సంఘానికి తగిన సలహాలు అందించేందుకు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్ ఛైర్మన్‌గా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా మరో అయిదుగురు సీనియర్ ఐఏఎస్‌లతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇద్దరు సీఎస్‌లు పదవీవిరమణ చేసినా ఆ కమిటీ నివేదిక అందలేదు.