బెజవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు దూర తీరాల నుంచి వచ్చే భక్తుల కోసం దుర్గాఘాట్ వద్ద ఆధునిక పద్ధతిలో నిర్మించిన విశాలమైన షెడ్డు అందుబాటులోకి వచ్చింది. దుర్గగుడి అధికారుల విజ్ఞప్తి మేరకు ముందుకు వచ్చిన రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్).... ఈ షెడ్డును నిర్మించి ఆలయానికి అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 35 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన నిర్మాణానికి...సెప్టెంబర్ 12న శంకుస్థాపన చేశారు.
విదేశాల నుంచి ఫ్యాబ్రిక్ దిగుమతి
ఒప్పందంలో భాగంగా దుర్గా ఘాట్ వద్ద ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో షెడ్డు రూపుదిద్దుకుంది. టెన్సైల్ ఫ్యాబ్రిక్ విధానంలో ఈ షెడ్డును పూర్తి చేశారు. ఈ షెడ్డుకి ఉపయోగించిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ తరహాలో ఇప్పటికే ఘాట్ రోడ్డులో క్యూలైన్ల వద్ద, మహా మండపం ఆవరణలో షెడ్లు నిర్మించారు. ఇప్పుడు దుర్గాఘాట్ వద్ద నిర్మించిన ఈ షెడ్డు.. 15 నుంచి 20 ఏళ్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.