పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ.. విజయవాడలో కాంగ్రెస్ ఆందోళన(Congress protests)కు దిగింది. ఎంజీ రోడ్డులోని పెట్రోల్ బంక్ ఎదుట చేపట్టిన నిరసనలో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, ఇతర నేతలు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయని.. ట్యాక్సీల పేరిట దోచుకోవడం ఆపితే ధరలు దిగివస్తాయని శైలజానాథ్ అన్నారు. పెట్రో ధరల మంటకు నిరసనగా ఈనెల 17న కర్నూలులో భారీ సైకిల్ యాత్ర చేపడతామన్నారు.
విశాఖలో భిక్షాటన..
పెరిగిన ధరలు తగ్గిచాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ధరల పెరుగుదలను తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఏ.నారాయణరావు పాల్గొన్నారు. నగర కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొడిబోయిన పరదేసి ఆధ్వర్యంలో సీతంపేటలోని దుర్గ వినాయక ఆలయం నుంచి భిక్షాటన చేశారు.