అధికారులకు ఫిర్యాదులు
విజయవాడలో కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగుపర్చేందుకు 3 నెలల కాలానికి అవుట్‌సోర్సింగ్ పద్ధతిన సిబ్బందిని విధుల్లోకి తీసుకునే ప్రక్రియలో అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరికి నెలకు రూ.12వేలు చెల్లించేలా మొత్తం 533 మంది అవసరం అంటూ ఇటీవల టెండర్లు ఆహ్వానించారు. కొంతమంది గుత్తేదారులు ముందుకు రాగా వారిని ఎంపిక చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి 7 రోజుల్లోగా సిబ్బందిని సరఫరా చేసి అగ్రిమెంట్లు చేసుకోవాల్సి ఉంది. నెలాఖరవుతున్నా ఇప్పటి వరకు గుత్తేదార్లు మాత్రం పూర్తిస్థాయిలో సిబ్బందిని సరఫరా చేయలేదు. కరోనా వైరస్ వ్యాప్తి అధికం అవుతుండడం వల్ల ఎవరూ పారిశుద్ధ్య విధులు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఈ స్థితిలో గుత్తేదార్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కుమ్మక్కై పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. లేని సిబ్బంది ఉన్నట్లు, రానివారు వచ్చినట్లు, సరఫరా చేయకుండానే చేసినట్లుగా దొంగలెక్కలు వేస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై కార్మిక యూనియన్లు సైతం అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి. రూ.లక్షల ప్రజాధనం చేజారిపోయే పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు.