CPI RAMAKRISHNA: రాష్ట్రపతి ఎన్నికల్లోఎన్డీయే అభ్యర్థికి.. వైకాపా మద్దతు తెలపడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి స్వప్రయోజనాలు, స్వార్థరాజకీయాలు ఎక్కువయ్యాయని.. అందుకే మద్దతు తెలిపారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై ఒత్తిడి తెచ్చే సమయం వచ్చినా.. ఎందుకు భాజపాకు లొంగిపోతున్నారని నిలదీశారు. ముఖ్యమంత్రి తన కేసులు మాఫీ, స్వార్థ ప్రయోజనాల కోసం భాజపాకు లొంగిపోయారని.. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు.
సీపీఎం బాబురావు: ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసిన భాజపాకి.. రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా మద్దతు పలకడం శోచనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు అన్నారు. ధరల భారాలు, పన్నుల పెంపు, ఇళ్ల పంపిణీ వంటి ప్రజా సమస్యలపై విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదలు, బలహీన వర్గాలు, మైనారిటీల హక్కులను హరిస్తున్న మోదీ సర్కార్‌కు జగన్ సామాజిక న్యాయం పేరుతో బలపరచడం మోసపూరితమని మండిపడ్డారు. ఆర్థిక స్థితి బాగోలేదనే సాకుతో దుల్హన్ పథకాన్ని నిలిపి వేయడం సిగ్గుచేటన్నారు.