ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జోరుగా కోడి పందేలు..పెద్ద మొత్తంలో చేతులు మారిన సొమ్ము - ఏపీలో జోరుగా కోడి పందేలు న్యూస్

సంక్రాంతి సందర్భంగా ఏటా నిర్వహించే కోడిపందేలు....ఈ సారీ జోరుగా సాగాయి. ఉభయగోదావరితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ....బరుల వద్దకు పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. ముందు నుంచి ఆంక్షలు విధించిన పోలీసులు.....తీరా పందేలు మొదలయ్యాక పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జోరుగా కోడి పందేలు
జోరుగా కోడి పందేలు

By

Published : Jan 13, 2021, 10:45 PM IST

తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో కోడిపందాలు, గుండాటలు జోరుగా కొనసాగుతున్నాయి. కఠినంగా వ్యవహరిస్తామన్న పోలీసులు...తీరా పందేలు మొదలయ్యాక ఆపే ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో జోరుగా పందేలు జరిగాయి. ముమ్మిడివరం నియోజవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. పి.గన్నవరం, అమలాపురం, అల్లవరం, కొత్తపేట, రాజోలు, ఐ.పోలవరం ముమ్మిడివరం, అంబాజీపేట తదితర మండలాల్లో..ఉదయం నుంచే పందేలు, గుండాటలు కొనసాగుతున్నాయి. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పందేలను ప్రారంభించారు.

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగానూ పందేలు హోరెత్తాయి. దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో భారీగా కోడి పందాలు నిర్వహించారు. శ్రీరామవరంలో పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి పందేలు ఆడారు. తణుకు,ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో పందేలు సాగాయి. ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం సీసలిలో సంప్రదాయ పద్ధతిలో కోడిపందాలను తెదేపా ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రారంభించారు.

కృష్ణా జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పందెంకోళ్లు యథేచ్చగా ఎగిరాయి. జిల్లాల పరిధిలో నిర్వాహకులు పెద్దఎత్తున బరులు ఏర్పాటు చేయగా..పందెం రాయుళ్లు బారులు తీరారు. ఈ సారి విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు అమలుతో..అక్కడ మాత్రం పందెం కోడి ఎగరలేదు. పోలీసులు నిఘాతో పందెం రాయుళ్లు బరులను ఏర్పాటు చేయలేదు. బరులు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో..పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా రూరల్‌ పరిధిలో మాత్రం పందేలు యథేచ్చగా నిర్వహించారు. గ్రామాల శివారులోని పొలాల్లో పెద్దఎత్తున బరులను ఏర్పాటు చేశారు. బాపుల పాడు మండలం అంపాపురం శివారులో..అధికార పార్టీ నేతలు బరులను ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుంచో పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నారు. తెలంగాణ నుంచీ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్వాహకులు వసతి సహా విందు, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పందేల్లో లక్షలు చేతులు మారాయి.

జోరుగా కోడి పందేలు
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పందెం రాయుళ్లు జోరు పెంచారు. మోపిదేవి, నాగాయలంక, కోడూరు మండలాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. పందేలు నిర్వహిస్తే ఊరుకోమని చెప్పిన పోలీసులు..చివరికి అటువైపు కూడా చూడలేదు. జి.కొండూరు మండలంలోనూ కోడి పందేలు భారీగా సాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు బరుల వద్దకు చేరుకుని పందేలు వేస్తున్నారు. నిన్నటి వరకూ కఠినంగా వ్యవహరించిన పోలీసులు నేడు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్భయంగా పందేలు సాగిస్తున్నారు. చందర్లపాడులో భారీ బరులు సిద్ధం చేసి ఉదయం నుంచి పందేలు భారీగా నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి . పేకాట ఇతర జూద క్రీడలూ ఆడుతున్నారు. కైకలూరు, బాపులపాడు మండలం ఆలపాడులో పోలీసులు హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూనే బరుల్ని ఏర్పాటు చేశారు. షామియానాలు వేసి మరీ కోడిపందేలను కొనసాగిస్తున్నారు. కైకలూరులో గుండాటలో మోసపోయిన బాధితులు ఘర్షణకు దిగడంతో..కాసేపు వివాదం చెలరేగింది. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ తీర ప్రాంతాల్లోనూ కోడి పందేలను భారీ స్థాయిలో నిర్వహించారు. నగరం మండలంలో ఏర్పాటు చేసిన బరుల వద్దకు ఇతర జిల్లాల ప్రజలు వచ్చారు.

ఇదీచదవండి:పందెం కోళ్లకు బ్రహ్మచర్యం తప్పదా?!

ABOUT THE AUTHOR

...view details