సంక్రాంతి వచ్చిందంటే చాలు. పందెం రాయుళ్లకు పండగే. ఈసారి కోడి పందేలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలంటూ.. హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పందేలు నిర్వహించే వారిని బైండోవర్ చేయడం, కత్తుల్ని స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు. కానీ పందేల రాయుళ్లు మాత్రం గుట్టుగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుట్టుగా బరుల సిద్ధం చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారీ చివరి నిమిషంలో ఆటంకాలన్నీ తొలగిపోయి బరిలో కోడిని దించగలమని ధీమా ప్రదర్శిస్తున్నారు.
రహస్య ప్రదేశాల్లో నిర్వాహణ...
ఏటా కోడి పందేలు నిర్వహించే ప్రదేశాలపై పోలీసుల నిఘా పెరగడం.. అక్కడ ఏర్పాటు చేస్తున్న బరులను గుర్తించి ధ్వంసం చేయడం వల్ల పందెం రాయుళ్లు దారి మారుస్తున్నారు. రహస్య ప్రదేశాలను ఎంపిక చేసుకుని బరులు సిద్ధం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, ఉండి, ఆకివీడు, నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, పెనుగొండ, అత్తిలి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు, గణపవరం తదితర ప్రాంతాల్లో బరులు సిద్ధమవుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం ప్రాంతాల్లో బరులు ఏర్పాటు రహస్యంగా సాగుతోంది. కేశనకుర్రుపాలెంలో మూడెకరాల వ్యవసాయ భూమిని ఇప్పటికే చదును చేశారు. వాహనాలు నిలిపేందుకు 5 ఎకరాల కొబ్బరి తోటను సిద్ధం చేశారు. ముమ్మిడివరం మండలంలోనూ పందేల నిర్వహణకు రహస్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు, ఈడ్పుగల్లు, ఉప్పులూరులో బరులు సిద్ధం చేస్తుండగా పోలీసులు వాటిని ధ్వంసం చేసేశారు. గన్నవరం, పెనమలూరు , గుడివాడలో గుట్టుచప్పుడు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.