సీఎం ప్రస్తుత క్యాంపు కార్యాలయం నుంచే పనిచేయాలని పట్టుబట్టే హక్కు పిటిషనర్లకు లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు హైకోర్టులో కౌంటరు దాఖలుచేశారు. ప్రతి జిల్లాలో క్యాంపు కార్యాలయం బస/వసతి ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉందన్నారు.అమరావతి నుంచి కార్యాలయాల తరలింపును నిలువరించాలని కోరుతూ ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ కార్యదర్శి ధనేకుల రామారావు, మరొకరు హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల జరిగిన విచారణలో సీఎం క్యాంపు కార్యాలయం, కార్పొరేషన్ల కార్యాలయాలపై స్పష్టత ఇస్తూ కౌంటరు వేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు హైకోర్టులో కౌంటరు దాఖలు చేశారు.
కౌంటరులోని వివరాలు ఇలా..
‘పాలనా వికేంద్రీకరణ చట్టంలోని సెక్షన్ 8లో అంశాలను మించి పిటిషనర్ అభ్యర్థించారు. సీఎం క్యాంపు కార్యాలయం ఒకచోటే ఉండాలనేది చట్టబద్ధమైంది కాదు. ‘క్యాంపు ఆఫీసు’ అనే పదానికి ఏపీ సీఆర్‌డీఏ లేదా రాజధాని బృహత్తర ప్రణాళిక ప్రకారం చట్ట నిబంధనలు వర్తించవు. బృహత్తర ప్రణాళికలో పేర్కొన్న నగరాల్లోనూ సీఎం క్యాంపు ఆఫీసు, దాని స్థానాన్ని సూచించలేదు. ప్రస్తుత క్యాంపు కార్యాలయం నుంచే ముఖ్యమంత్రి పనిచేయాలని పట్టుబట్టే హక్కు పిటిషనర్లకు లేదు. ఇతర జిల్లాల్లో వసతులు ఉండకూడదని చెప్పడానికి వీల్లేదు. అందువల్ల అనుబంధ పిటిషన్‌ను కొట్టేయండి’ అన్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి, కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని వివిధ కార్పొరేషన్ల కార్యాలయాలకు యథాతథ స్థితి (స్టేటస్ కో)ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు.