రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు కలిపి ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సాంకేతిక విద్య కళాశాలలకు ప్రత్యేకంగా జేఎన్‌టీయూ ఉన్నట్లే దీన్ని ఏర్పరచాలని సూచించారు. ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ కళాశాలల విశ్వవిద్యాలయానికి మంచి పరిజ్ఞానం ఉన్నవారు నేతృత్వం వహించాలి. డిగ్రీ కోర్సులకు విలువను జోడించాలి. దేశంలో డిగ్రీ చదవాలనుకునే వారంతా ఏపీకి రావాలనేలా ఉండాలి. అధ్యాపక పోస్టులు ఎక్కడ ఖాళీ ఉన్నా వెంటనే భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. నియామకంలో ఎక్కడా సిఫార్సులకు అవకాశం ఉండకూడదు. పరీక్షలు నిర్వహించి, ఎంపికచేయాలి. బోధన సిబ్బంది కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని పరిశీలించాలి. విశ్వవిద్యాలయాల్లో క్రమశిక్షణ, పారదర్శకత అత్యంత ముఖ్యం. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి’ అని ఆదేశించారు.
నియోజకవర్గానికో ప్రభుత్వ కళాశాల
‘రాష్ట్రంలో నాలుగైదు విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుని, వాటిని దేశంలోనే ఉత్తమ వర్సిటీల స్థాయికి తీసుకువెళ్లాలి. పట్టభద్రులకు తప్పనిసరిగా 10 నెలల ఇంటర్న్‌షిప్ ఉండాలి. మొదటి, రెండో సంవత్సరాల్లో రెండు నెలల చొప్పున, మూడో ఏడాది ఆరు నెలలు ఇంటర్న్‌షిప్ ఉండాలి. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 30 నైపుణ్య కళాశాలల్లోనూ ఇంటర్న్‌షిప్ కోసం ఏర్పాట్లు చేయాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల ఉండాలి. జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాల స్థాయికి తీసుకువెళ్లాలి. దీని కోసం ‘నాడు-నేడు’ కింద పనులు చేపట్టాలి. చదువులు ఏదోలా సాగితే చాలనుకునేవాళ్లు డిగ్రీ కోర్సులను ఎంచుకునే పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. కానీ, విదేశాల్లో డిగ్రీని చాలా అత్యుత్తమ కోర్సుగా భావిస్తారు. మన రాష్ట్రంలోనూ డిగ్రీ కోర్సులను సమర్థంగా రూపొందించాలి. డిగ్రీ కళాశాలలను ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలి’ అని సీఎం జగన్ ఆదేశించారు.